Begin typing your search above and press return to search.

జగన్ పీకేసిన లెక్కలు చెప్పిన రోజా

By:  Tupaki Desk   |   18 Sept 2021 5:00 PM IST
జగన్ పీకేసిన లెక్కలు చెప్పిన రోజా
X
ఏపీ వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి నిప్పులు చెరిగారు. తనదైన శైలిలో టీడీపీ నేతల కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, ఇతరులు చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘సీఎం జగన్ ఏవేవి పీకేశారో ’ ఎమ్మెల్యే రోజా లెక్కలేసి మరీ చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మాట్లాడారు. టీడీపీసీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై చెలరేగిపోయారు. సీఎం జగన్, మంత్రులపై అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు బాధించాయన్నారు. మంత్రిగా పనిచేసిన వ్యక్తి వయసుకు తగ్గట్టుగా మాట్లాడలేదన్నారు. అయ్యన్న దిగజారుడు మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

టీడీపీలో సీనియర్లకు విలువ లేదని.. కోడెలపై ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా ఆయనను మానసిక క్షోభకు గురిచేసి చంద్రబాబు ఆత్మహత్యకు ఉసిగొల్పారని రోజా విమర్శించారు. అప్పుడు అయ్యన్నపాత్రుడు ఏమయ్యాడని రోజా నిలదీశారు. ఈరోజు కోడలపై ప్రేమ పుట్టుకొచ్చి ఆయన్ను పొగడకున్నా అభ్యంతరం లేదన్నారు.జగన్ ను, మంత్రులను విమర్శించడం దేనికని ప్రశ్నించారు.

చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్లు వచ్చి జగన్ ను రిక్వెస్ట్ చేయడం వల్లే ముఖ్యమంత్రి ప్రభుత్వం ఆధ్వర్యంలో సినిమా టికెట్ల అమ్మడానికి ఓకే చెప్పాడని.. టీడీపీ నేతలు ఈ విషయంలో చిల్లరగా మాట్లాడుతున్నారని రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ ను పట్టుకొని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ‘ఏం పీకుతారని అడుగుతున్నారని.. ముఖ్యమంత్రి జగన్ ఏవేవీ పీకేశారో ’ ఈ సందర్భంగా రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నీ ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి, చంద్రబాబు సీఎం పదవిని’ జగన్ పీకేశారని రోజా విరుచుకుపడ్డారు. లోకేష్ ను కనీసం ఎమ్మెల్యే కాకుండా చేశాడని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో టీడీపీ జెండానే పీకేశాడని విమర్శించారు. అయ్యన్నపాత్రుడు ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రోజా హితవు పలికారు.