Begin typing your search above and press return to search.

బాధలు తెలియాలంటే కూతుళ్లు ఉండాలా?

By:  Tupaki Desk   |   24 Sept 2015 5:43 PM IST
బాధలు తెలియాలంటే కూతుళ్లు ఉండాలా?
X
సంబంధం లేని పోలికలు పెట్టి తిట్టేయాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా తర్వాతే ఎవరైనా. రాజకీయాలన్నాక విమర్శలు.. ఆరోపణలు మామూలే. కానీ.. తిట్టిన తిట్లకు కారణంగా కూడా అర్థం కానంతగా తిట్టేయాలంటే ఆమే. రోజా వాగ్ధాటికి ఎంతటి వారైనా కళ్లు అప్పగించాల్సిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు చెబితే చాలు.. చెలరేగిపోయే ఆమె.. తాజాగా చిత్రమైన వాదనను తీసుకొచ్చి మరీ తిట్టేశారు.

ఏపీలో మహిళలు ఎదుర్కొంటున్న బాధలు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అస్సలు అర్థం కావటం లేదని మండిపడ్డారు. అలా ఎందుకు జరుగుతుందంటే.. చంద్రబాబుకు కూతుళ్లు లేకపోవటం వల్లేనని సెలవిచ్చారు. విజయవాడ స్టెల్లా కాలేజీలో.. ఆ మధ్యన నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయంటే కారణం.. చంద్రబాబు హయాంలో భద్రత లేకనే అని చెప్పిన ఆమె.. కూతుళ్లు లేని కారణంగానే ఆయనకు బాధ తెలీదంటూ తిట్టేశారు.

ఎదుటి మనిషి బాధలు తెలియాలంటే.. బంధురికాలు ఉండాలా? లేక.. స్పందించే మనసు ఉంటే సరిపోతుందా? పిల్లలు ఎవరు పుట్టాలన్నది ఎవరూ డిసైడ్ చేయలేరు. అలాంటి బాబుకు కూతుళ్లు లేకపోవటాన్ని ఎత్తి చూపిస్తూ.. అదో తప్పుగా అభివర్ణించటం చూసినప్పుడు రోజా ఎంత గడుసు నేత ఇట్టే తెలుస్తుంది. రాజకీయాల్లో ఈ తరహా విమర్శలు రోజాకు మాత్రమే చెల్లుతాయంటూ తెలుగు తమ్ముళ్లు ఉడికిపోతున్నారు.