Begin typing your search above and press return to search.

ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు: ఇష్యూల మీద మాట్లాడిన రోజా

By:  Tupaki Desk   |   23 July 2015 2:32 PM IST
ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు: ఇష్యూల మీద మాట్లాడిన రోజా
X
సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ.. ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రోజా.. మాట‌ల్లో విష‌యం కంటే కూడా మ‌సాలానే ఎక్కువ ఉంటుంది.

చిత్ర‌విచిత్రంగా తిట్టిపోసే రోజా.. తాజాగా మాత్రం త‌న వైఖ‌రికి భిన్నంగా ప‌లు అంశాల‌పై మాట్లాడారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఆమె స‌బ్జెక్ట్ మీద త‌న వాద‌న‌ను ఎక్కువ‌గా వినిపించారని చెప్పొచ్చు.

ఏపీలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంద‌న్న వాద‌న‌ను వినిపించిన రోజా.. అందుకు త‌గ్గ‌ట్లుగా ఈ మ‌ధ్య కాలంలో చోటు చేసుకున్న ఉదంతాల్ని ప్ర‌స్తావించారు. ఇటీవ‌ల ఇసుక రీచ్ ల‌కు సంబంధించి ఎమ్మార్వో వ‌న‌జాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే అనుచ‌రులు దాడి చేయ‌టం.. అదో పెద్ద ఇష్యూగా మార‌టం.. చివ‌ర‌కు ఈ అంశంపై విచార‌ణ‌కు ఆదేశించ‌టం తెలిసిందే.

బుధ‌వారం జ‌రిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో త‌న ప‌రిధిలో లేని ఇసుక రీచ్ వ్య‌వ‌హారంలో వ‌న‌జాక్షి త‌ల‌దూర్చిన‌ట్లుగా ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా వార్త‌లు రావ‌టం తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన రోజా.. టీడీపీ ఎమ్మెల్యే అనుచ‌రులు దాడి చేస్తే.. దాన్ని చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి బాబు సైతం జ‌రిగిన త‌ప్పు మొత్తం అధికారిదేన‌ని తేల్చ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌హిళా అధికారిపై ఎమ్మెల్యే చింత‌మ‌నేని దాడి చేస్తే.. బాబు దాన్ని స‌మ‌ర్థిస్తారా? అని ప్ర‌శ్నించారు.

ఇలాంటివి చేస్తే నిజాయితీప‌రులైన అధికారుల‌కు ర‌క్ష‌ణ ఎక్క‌డ ఉంటుంద‌ని ప్ర‌శ్నించిన ఆమె.. తెలుగుదేశం పార్టీకి మ‌హిళ‌ల ప‌ట్ల గౌర‌వం ఎంత‌మాత్రం లేద‌ని వ్యాఖ్యానించారు.

ఇటీవ‌ల నాగార్జున యూనివ‌ర్సిటీలో ఒక విద్యార్థిని ర్యాగింగ్‌కు గురై ఆత్మ‌హ‌త్య చేసుకుంటే.. ఈ ఉదంతంపై కూడా ఏపీ స‌ర్కారు పెద్ద‌గా స్పందించ‌లేద‌ని.. కేసుకు సంబంధించి స‌రైన చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదంటూ విమ‌ర్శించారు. బాబు స‌ర్కారులో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేదంటూ ఆమె తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.