Begin typing your search above and press return to search.

రోజా.. చెవిరెడ్డి, కాకాని, ఆనం.. వీళ్లంతా `అదే బ్యాచ్‌`!!

By:  Tupaki Desk   |   13 Dec 2020 7:00 AM IST
రోజా.. చెవిరెడ్డి, కాకాని, ఆనం.. వీళ్లంతా `అదే బ్యాచ్‌`!!
X
అవును! వైసీపీలో సీఎం జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన వారి గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చ సాగుతోంది. నెల్లూరు, చిత్తూరు, అనంత‌పురం.. ఇలా.. ప‌లు జిల్లాల్లో సీఎం జ‌గ‌న్ సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వీరిలో రోజా, చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డి.. ఇలా అనేక మంది రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దీనికి కార‌ణం ఏంటి? అంటే.. మ‌రో ఆరేడు మాసాల్లో మంత్రి వ‌ర్గం పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఉండ‌డ‌మే!

పైన చెప్పుకొన్న వారితోపాటు.. ఇంకా ప‌దుల సంఖ్య‌లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు పార్టీ లోను, బ‌య‌ట కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నారు. కొంద‌రు ఫైర్ బ్రాండ్స్‌గా పార్టీని ముందుకు న‌డిపించిన వారు కూడా ఉన్నారు. దీంతో వీరంతా కూడా కేబినెట్‌లో సీట్లు ఆశించారు. గ‌తంలో ఏర్ప‌డిన తొలి కేబినెట్‌లోనే రోజా, ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి వంటివారు మంత్రులుగా వ‌స్తార‌ని పెద్ద ఎత్తున అంచ‌నాలు ఉన్నాయి. అయితే.. వీరిని ప‌క్క‌న పెట్టారు సీఎం జ‌గ‌న్‌. త‌న‌కంటూ.. డిఫ‌రెంట్‌గా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రులు సీఎం జ‌గ‌న్‌, పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి, మ‌రో మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి వంటి వారు మాత్ర‌మే ఉన్నారు.

మ‌రి మంత్రి ప‌ద‌వుల‌పై ఆశావ‌హ‌లు చాలా మందే ఉన్నా.. వీరికి అడ్డు వ‌స్తున్న అంశాలేంటి? జ‌గ‌న్‌కు-ఆశావ‌హ రెడ్డి సామాజిక వ‌ర్గానికి మ‌ధ్య కుద‌ర‌ని కెమిస్ట్రీ ఏంటి? అంటే.. నిజానికి వీరంతా అర్హులే. మంత్రి ప‌ద‌వులు ఇస్తే క‌నుక దూసుకుపోవ‌డం ఖాయ‌మే. అయితే.. వీరి క‌న్నా.. జ‌గ‌న్‌కు ముఖ్యులైన వారు, ఆయ‌న కుటుంబంతో అవ్యాజానుబంధం పెంచుకున్న వారు మ‌రింత మంది ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వారికి అవ‌కాశం చిక్క‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రో ప‌ది మాసాల్లో జ‌రుగుతుంద‌ని భావిస్తున్న మంత్రి వ‌ర్గ కూర్పులోనూ వీరికి చాన్స్ నిల్లే అంటున్నారు. పైగా.. సీఎం కూడా రెడ్డి వ‌ర్గానికి చెందిన నాయ‌కుడే క‌నుక‌.. ఎక్క‌వు మందికి అవ‌కాశం ఇస్తే.. రాష్ట్రంలో రెడ్డి రాజ్యం ఏర్ప‌డింద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నేది కూడా ప్ర‌ధాన‌కారణంగా క‌నిపిస్తోంది.