Begin typing your search above and press return to search.

రోజా సంచ‌లనం!... బాబుకు ఆ హ‌క్కే లేదు!

By:  Tupaki Desk   |   13 April 2018 10:05 AM GMT
రోజా సంచ‌లనం!... బాబుకు ఆ హ‌క్కే లేదు!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం జ‌రుగుతున్న పోరాటంలో ఆది నుంచి ఒక‌టే స్టాండ్ తో ముందుకు సాగుతున్న పార్టీగా వైసీపీ మంచి మైలేజీ సాధించింద‌నే చెప్పాలి. ప్ర‌త్యేక హోదాతో ఏపీకి ఏ మేర ల‌బ్ధి చేకూరుతుంద‌న్న విషయం జ‌నానికి అర్థ‌మ‌య్యేలా చెప్పేందుకు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏకంగా యువ భేరీల పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలే నిర్వ‌హించారు. గుంటూరు జిల్లాలో ఏకంగా ఆమ‌ర‌ణ దీక్ష‌కు కూడా దిగారు. అయితే ఇప్పుడు ప్ర‌త్యేక హోదా కోసం నానా యాగీ చేస్తున్న టీడీపీ... నాడు జ‌గ‌న్ దీక్ష‌ను భ‌గ్నం చేసేసింద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. పార్ల‌మెంటులో ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం న‌రేంద్ర మోదీ స‌ర్కారును ఇరుకున పెట్టేలా అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌డంలోనూ టీడీపీ కంటే వైసీపీనే ముందు వ‌రుస‌లో ఉంద‌నే చెప్పాలి. వైసీపీ ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామ‌ని చెప్పిన టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు రాత్రికి రాత్రి మాట మార్చేసి... తెల్లారేస‌రికంతా తాము కూడా అవిశ్వాస తీర్మానం పెడ‌తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత టీడీపీ ఎంపీలు త‌మ‌దైన శైలిలో నిర‌స‌న‌లు తెలిపారు. మొత్తంగా పార్ల‌మెంటు సాక్షిగా టీడీపీ ఎంపీలు డ్రామాను ర‌క్తి క‌ట్టించార‌నే చెప్పక త‌ప్ప‌దు. అయితే ప్ర‌త్యేక హోదా పోరును మ‌రింత‌గా తీవ్ర‌త‌రం చేస్తూ వైసీపీ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేసి... ఢిల్లీలోనే ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగారు. ప్ర‌స్తుతం అనారోగ్యం క్షీణించిన వైసీపీ ఎంపీలు ఆసుపత్రిలో చేరినా దీక్ష‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు.

ఈ క్ర‌మంలో ఇక త‌మ వంతు దీక్ష‌లు ముగిశాయ‌ని, బ‌స్సు యాత్ర‌లు చేయ‌లేమంటూ చంద్ర‌బాబు ముఖం మీదే చెప్పేసిన టీడీపీ ఎంపీలు ఇళ్ల‌కు చేరిపోయారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ చేస్తున్న పోరాటాన్ని ప‌లుచ‌న చేసే ఉద్దేశంతో టీడీపీ ఓ కొత్త వాద‌న‌ను వినిపిస్తోంది. వైసీపీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యులు ఎందుకు రాజీనామాలు చేయ‌లేద‌ని ప్ర‌శ్నిస్తూ... వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు కూడా రాజీనామాలు చేస్తే... తాము కూడా ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తామ‌ని టీడీపీ ఎంపీల‌తో పాటు చంద్ర‌బాబు కూడా చెబుతున్న వైనం నిజంగానే ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు నిజ‌నైజ‌మిదేనంటూ వైసీపీ ఫైర్ బ్రాండ్‌, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా రంగంలోకి దిగిపోయారు. గ‌తంలో టీడీపీ అనుస‌రించిన వ్యూహాన్ని గుర్తు చేస్తూ రోజా చేసిన స‌వాల్ నిజంగా చంద్ర‌బాబుకు వ‌ణుకు పుట్టించేదేన‌ని చెప్పాలి. రాజ్య‌స‌భ స‌భ్యుల రాజీనామాల‌పై రోజా ఏమ‌న్నార‌న్న విష‌యానికి వస్తే... బోఫోర్స్ కుంభకోణం సమయంలో ఎన్టీఆర్ హయాంలో ప్రతిపక్ష ఎంపీలంతా రాజీనామా చేశారని, ఆ రోజు ఎన్టీఆర్ తన లోకసభ స‌భ్యుల‌తోనే రాజీనామా చేయించారని రోజా చెప్పారు. రాజ్యసభ సభ్యులతో మాత్రం నాడు ఎన్టీఆర్ రాజీనామా చేయించలేదని, నాడు ఇప్పుడు సంధిస్తున్న ప్ర‌శ్న‌ను ఎందుకు చేయించలేదని ఆమె చంద్ర‌బాబును ప్రశ్నించారు. ఆ రోజు ఎన్టీఆర్ ప‌క్క‌న చంద్ర‌బాబే ఉన్నార‌ని, నాడు రాజ్య‌స‌భ సభ్యుల‌తో ఎందుకు రాజీనామా చేయించ‌లేద‌న్న విష‌యంపై చంద్రబాబు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలోను రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న‌ నందమూరి హరికృష్ణకు వెన్నుపోటు పొడిచి ఆయ‌న చేత‌ రాజీనామా చేయించిన చంద్రబాబు - తన బినామీ అయిన సుజనా చౌదరితో మాత్రం రాజ్య‌స‌భ సభ్వ‌త్వానికి రాజీనామా చేయించలేదని, అలా ఎందుకు చేశారో చెప్పాలని రోజా నిలదీశారు. టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించే దమ్ము - ధైర్యం లేను చంద్ర‌బాబు ఈ రోజు సిగ్గులేకుండా వైసీపీపై నిందలు వేయడానికి ఏం అర్హత ఉందో చెప్పాలని ఆమె మండిపడ్డారు. అంత‌టితో ఆగ‌ని రోజా... ప్రత్యేక హోదా కోసం రాష్ట్రమంతటా ఆందోళనలు - ఆగ్రహావేశాలు పెల్లుబిగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆనంద నగరాలు పేరుతో వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటని విరుచుకుప‌డ్డారు. ఇలాంటి పనికిమాలిన కార్యక్రమానికి తెలుగువారైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకావడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వ పథకాలపై 71 శాతం మంది సంతృప్తిగా ఉన్నారన్న సీఎం వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్‌ ఇచ్చారు. మరి ప్ర‌జ‌ల్లో అంత‌గా సంతృప్తి ఉంటే... ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌ల‌కు వెళ్లే ద‌మ్ముందా? అని ఆమె చంద్ర‌బాబుకు సూటిగానే స‌వాల్ విసిరారు. మొత్తంగా చంద్ర‌బాబు రోజుల త‌ర‌బ‌డి, ఏ వేదిక ఎక్కినా వైసీపీపై విరుచుకుప‌డుతున్న తీరుకు రోజా ఒక్క మాట‌తో స‌మాధానం చెప్పేశార‌న్న వాద‌న వినిపిస్తోంది.