Begin typing your search above and press return to search.

సూపర్ ఓవర్ లో విజయం భారత్ సొంతం!

By:  Tupaki Desk   |   29 Jan 2020 12:02 PM GMT
సూపర్ ఓవర్ లో విజయం భారత్ సొంతం!
X
క్రికెట్ టీం ఇండియా చరిత్ర లో మరో అద్భుత విజయం. పట్టువదలని విక్రమార్కునిలా - తక్కువ స్కోర్ అయినప్పటికీ కూడా దాన్ని సూపర్ ఓవర్ వరకు తీసుకుపోయి థ్రిలింగ్ విక్టరీ నమోదు చేసింది. మరోసారి సూపర్ ఓవర్ లో హిట్ మ్యాన్ తన బ్యాట్ ను ఝుళిపించి టీం ఇండియా కి అద్భుత విజయాన్ని అందించడమే కాదు ..రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ఇండియా సొంతం చేసుకునేలా చేసాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..

ప్రస్తుతం టీం ఇండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ముందుగా టి 20 సిరీస్ మొదలుపెట్టిన ఇండియా మొదటి రెండు మ్యాచ్ లలో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక నేడు హామిల్టన్‌ వేదికగా జరిగిన మూడో మ్యాచ్ లో కూడా టీమిండియా విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ లో ఎట్టకేలకు భారత్ విజయం సాధించింది.

టాస్ ఒడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ (65) - విరాట్ కోహ్లీ (38) - కేఎల్ రాహుల్ (27) పరుగులు చేశారు. ఒకానొక దశలో ఇండియా స్కోర్ ఈజీగా 200 దాటేస్తుంది అనుకున్నప్పటికీ - మధ్యలో ఆతిధ్య బౌలర్లు కట్టడిచేసారు. ఆ తరువాత 179 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై కావడం తో సూపర్ ఓవర్ ఏర్పాటు చేసారు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్ సన్ 95 పరుగులతో ఒంటరి పోరాటం చేసాడు. కానీ , కెప్టెన్ కి సహకారం లభించకపోవడం తో మ్యాచ్ ఇండియా సొంతం అయ్యింది. ఇక భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ - షమీ రెండేసి వికెట్లు తీశారు.

సూపర్ ఓవర్ లో న్యూజిలాండ్ జట్టు 6 బంతుల్లో 18 పరుగులు చేయగా - టీమిండియా తరపున బ్యాటింగ్ కు దిగిన కేఎల్ రాహుల్ - రోహిత్ శర్మ 20 పరుగులు చేసి భారత్‌ ను విజయతీరాలకు చేర్చారు. హిట్ మ్యాన్ మరోసారి తన బ్యాట్ పవర్ ఏంటో చూపిస్తూ సూపర్ ఓవర్ చివరి రెండు బంతుల్లో 2 సిక్సర్లు బాదడంతో టీమిండియా అద్భుత విజయం సాధించింది.