Begin typing your search above and press return to search.

ముగ్గురు మొనగాళ్లు.. మురిపించే విజయాలు!

By:  Tupaki Desk   |   2 Oct 2020 4:00 AM GMT
ముగ్గురు మొనగాళ్లు.. మురిపించే విజయాలు!
X
ఐపీఎల్లో ముగ్గురు మొనగాళ్లు అంటే సురేష్ రైనా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలనే చెప్పుకోవాలి. కోహ్లీ ఇప్పటికే ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్ మెన్ గా పేరు పొంది అన్ని ఫార్మాట్లలో రికార్డు స్థాయిలో పరుగులు చేసి ఎన్నో విజయాలు అందించాడు. వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ లో ఉంటున్నాడు. టెస్టుల్లోనూ మంచి ర్యాంక్ లోనే ఉన్నాడు. రోహిత్ శర్మ కొన్నేళ్లుగా వన్డేల్లో బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించాడు. టీమిండియాలో ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ కోహ్లీ ఉన్నా టీమిండియా తాజాగా సాధించిన విజయాల్లో కోహ్లీ కంటే రోహిత్ శర్మ పాత్రే అధికంగా ఉంది. అతడు కెరీర్లోనే అత్యుత్తమ స్టేజ్ లో ఉన్నాడు. సురేష్ రైనా ఇప్పుడు జట్టులో లేనప్పటికీ టీమిండియా గొప్ప ఫినిషర్ గా పేరు తెచ్చుకొని ఎన్నో మ్యాచ్ లలో విజయాలు అందించాడు.

ఈ ముగ్గురు బ్యాట్స్ మెన్లు ఐపీఎల్ లో కూడా 5 వేల పరుగులు సాధించి ఎవరికీ అందని ఎత్తుకు చేరుకున్నారు. తమ జట్లకు ఎన్నో విజయాలు కట్ట బెట్టారు. ఈ ముగ్గురు బ్యాట్స్మెన్ల గురించి చెప్పాలంటే ముందు రైనా పేరు చెప్పాల్సిందే. ఐపీఎల్ లో అత్యధిక విజయాలు, అత్యధిక పరుగులు సాధించిన జట్టు చెన్నై. ఆ జట్టులో కెప్టెన్ ధోనీ ఉన్నా పరుగుల రికార్డులు మాత్రం రైనా వే . ఆఖర్లో వచ్చి రైనా ధనాధన్ ఇన్నింగ్స్ తో ఎన్నో విజయాలు సాధించాడు. రైనా ఇప్పటి వరకూ ఐపీఎల్లో 5, 368 పరుగులతో పాటు ఓ సెంచరీ 38 అర్థ సెంచరీలు సాధించాడు.ఇక ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాకే అత్యధిక విజయాలు, ట్రోఫీలు సాధించింది. రోహిత్ తాజాగా ఐపీఎల్లో 5వేల పరుగుల క్లబ్లో చేరాడు. అతడి మొత్తం పరుగులు 5, 068. రోహిత్ ఓ సెంచరీ, 38 అర్ధ సెంచరీలు సాధించాడు.

ఇక ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అనుకున్నంత రేంజ్ లో రాణించక పోయినా ఆ జట్టు కాస్తోకూస్తో విజయాలు సాధిస్తోంది.. అంటే దానికి కారణం విరాట్ కోహ్లీనే. ప్రస్తుతం ఐపీఎల్ లో అత్యధిక పరుగులు జాబితాలో అగ్ర స్థానం కోహ్లీదే. కోహ్లీ బెంగళూరుకు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు. ఇప్పటి వరకు ఐదు సెంచరీలు, 36 అర్థ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్లో ఇప్పటిదాకా కోహ్లీ 5, 430 పరుగులు చేశాడు. ఈ ముగ్గురు బ్యాట్స్ మెన్లు తమ అద్వితీయ పోరాటంతో తమ జట్లకు విజయాలు అందించారు. అయితే ఈసారి టోర్నీలో రైనా లేకపోవడం కాస్త లోటుగానే కనిపిస్తోంది.