Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ ఖాన్ కి రాఖీబాయ్ వార్నింగ్!

By:  Tupaki Desk   |   11 April 2023 1:12 PM GMT
స‌ల్మాన్ ఖాన్ కి రాఖీబాయ్ వార్నింగ్!
X
కొన్ని నెల‌లుగా బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ని వార్నింగ్ లు వెంటాడుతోన్న సంగ‌తి తెలిసిందే. వివిధ రూపాల్లో భాయ్ ని చంపేస్తామంటూ దుండ‌గులు బెదిరిస్తున్నారు. తాజాగా మ‌రో బెదిరింపు కాల్ క‌ల‌క‌లం రేపుతుంది.

ఈసారి ఏకంగా ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి అగంత‌కుడు ఫోన్ చేసి స‌ల్మాన్ చంపేస్తామ‌ని బెదిరించాడు. స‌రిగ్గా సోమ‌వారం రాత్రి తొమ్మిది గంట‌ల‌కు ఈ కాల్ వ‌చ్చింది. దీంతో అప్ర‌త్త‌మైన పోలీస్ అధికారులు ఎవ‌రు బెదిరింపుకి పాల్ప‌డ్డారో తెలుసుకునే ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టారు.

ఆగంతుకుడు తన పేరు రాకీ భాయ్ అని.. జోధ్ పూర్ కు చెందిన గోరక్షకుడినని ప్రాధ‌మిక ద‌ర్యాప్తులో తేలింది. దీంతో రాఖీభాయ్ ని ప‌ట్టుకునేందుకు పోలీసులు గాలింపు చ‌ర్య‌లు మొద‌లు పెట్టారు. అత‌ని పేరిట నేర చ‌రిత్ర ఉందా? అని ఆరాలు తీస్తున్నారు. గ‌త నెల 18.. 23 తేదీలలో మెయిల్ ద్వారా దుండగులు బెదిరింపులకు పాల్ప‌డ్డారు. నేరుగా జైలు నుంచే గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కూడా సల్మాన్ ను చంపేస్తామని మ‌రోసారి హెచ్చరించాడు.

అంత‌కు ముందు 2018లో విచారణ కోసం కోర్టుకు వచ్చిన బిష్ణోయ్.. కోర్టు ఆవరణలోనూ ఇలాంటి వ్యాఖ్య‌లు చేసాడు. అలాగే ధాకడ్ కి చెందిన రామ్ సిహాగ్ అనే దుండగుడిని రాజస్థాన్ పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. తాజా బెదిరింపుతో మ‌రోసారి ముంబై అలెర్ట్ అయింది. ఇప్ప‌టికే పోలీసులు స‌ల్మాన్ కి భారీ బ‌ద్ర‌త క‌ల్పించారు. అలాగే స‌ల్మాన్ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా మ‌రింత ప‌టిష్టంగా మారింది.

భాయ్ ఇల్లు దాటి ఎక్క‌డికి వెళ్లినా? వెంట పెద్ద సైన్య‌మే క‌నిపిస్తుంది. అలాగే ఇటీవ‌లే బుల్లెట్ ప్రూప్ కారు కూడా స‌ల్మాన్ కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రాణ‌హాని ఉంద‌ని భావించి స‌ల్మాన్ విదేశాల నుంచి ఖరీదైన‌ కారు కొనుగోలు చేసారు.

త్వ‌ర‌లో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తోన్న 'కిసీకా భాయ్ కిసీకా జాన్' ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఈ సంద‌ర్భంగా వివిధ రాష్ట్రాల్లో సినిమాని ప్ర‌మోట్ చేయాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో పోలీసుల‌కు భాయ్ కి బ‌య‌ట‌కు వ‌చ్చే వెసులు బాటు క‌ల్పిస్తారా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.