Begin typing your search above and press return to search.

ఈ సండే..జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కిట‌కిట ప‌క్కా!

By:  Tupaki Desk   |   29 Dec 2017 10:44 AM IST
ఈ సండే..జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కిట‌కిట ప‌క్కా!
X
ఐటీ అన్నంత‌నే ప్ర‌పంచంలో గుర్తుకు వ‌చ్చే న‌గ‌రాల్లో హైదరాబాద్ పేరు ప‌క్కాగా ఉంటుంది. ఇక.. దేశంలో అయితే.. ఐటీ కారిడార్ గా హైద‌రాబాద్‌ కు ఉన్న గుర్తింపు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో మ‌రో ఆస‌క్తిక‌ర అంశంతో ప్ర‌పంచంలోనే అంద‌రి దృష్టి ప‌డేలా చేస్తుంద‌ని చెప్పాలి.

కొత్త సంవ‌త్స‌రం వేళ‌.. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో రోబో పోలీస్ ఒక‌టి విధుల్లోకి చేర‌నుంది. అత్యంత ట్రాఫిక్ ఉండే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర ఈ రోబో పోలీస్ విధుల్లో చేర‌నుంది. ఈ సండే నుంచి ఈ రోబో పోలీస్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. పూర్తిస్థాయి స్వ‌దేశీ సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి హోచ్ బోట్స్ రోబోటిక్స్ కంపెనీ ఈ రోబో పోలీస్ ను త‌యారు చేసింది.

దుబాయ్ లో చ‌క్రాల‌పై క‌దిలే రోబో పోలీస్ విధులు నిర్వ‌హిస్తుండ‌గా.. అందుకు భిన్నంగా హైద‌రాబాద్ రోబో పోలీస్‌ను రూపొందించారు. డిసెంబ‌రు 31 నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ లో విధులు నిర్వ‌హించేలా రోబో పోలీస్ ను ఏర్పాటు చేసి.. ద‌శ‌ల వారీగా అన్ని ప్రాంతాల‌కు విస్త‌రించ‌నున్నారు. హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన ల్యాబ్ లో ప్ర‌తి ఏటా 10 రోబోల‌ను త‌యారు చేసే అవ‌కాశం ఉంది.

ఒక్కో రోబో పోలీస్ ధ‌ర రూ.3లక్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని చెబుతున్నారు. రోబో ప‌ని తీరును ప‌రీక్షించేందుకు ప్ర‌త్యేకంగా ఒక స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. సినిమాల్లో హ‌డావుడి చేసే రోబో.. ఎక్క‌డో విదేశాల్లో వివిధ ర‌కాల ప‌నులు చేస్తుంద‌ని చెప్పే రోబో.. ఇప్పుడు హైద‌రాబాద్ రోడ్ల మీద‌కు వ‌చ్చి.. విధులు నిర్వ‌ర్తించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ రోబో పోలీస్ ప్ర‌జ‌ల్ని ప‌లుక‌రించ‌టం.. గుర్తు ప‌ట్ట‌టం.. ఫిర్యాదుల్ని విన‌టంతో పాటు.. అనుమానితుల్ని.. బాంబుల్ని గుర్తించ‌టం లాంటి చేస్తుంద‌ని చెబుతున్నారు. కొత్త సంవ‌త్స‌రం వేళ‌.. కొంగొత్త‌గా రోడ్ల మీద‌కు వ‌చ్చే ఈ రోబో పోలీసును చూసేందుకు హైద‌రాబాద్ వాసులు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కు పోటెత్త‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌నిలో ప‌ని.. భారీ ట్రాఫిక్ కు అనుగుణంగా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు పోలీసులు తీసుకుంటే మంచిది.