Begin typing your search above and press return to search.

హ‌మ్మ‌య్యా.. ఎట్ట‌కేల‌కు రోజానే గెలిచింది..!

By:  Tupaki Desk   |   8 Oct 2021 5:06 PM GMT
హ‌మ్మ‌య్యా.. ఎట్ట‌కేల‌కు రోజానే గెలిచింది..!
X
వైసీపీ ఫైర్‌బ్రాండ్‌, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా ఎట్ట‌కేల‌కు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ప‌ట్టు నిరూపించుకున్నారు.. త‌న పంతం నెగ్గించుకున్నారు. రోజాకు ఏ టీడీపీయో లేదా జ‌న‌సేనో ప్ర‌త్య‌ర్థి కాదు..ఆమెకు సొంత పార్టీలోనే కావాల్సినంత మంది శ‌త్రువులు ఉన్నారు. రోజాకు స‌గం కాలం సొంత పార్టీ శ‌త్రువుల‌తో పోరాటం చేస్తూ.. న‌గ‌రిలో ప‌ట్టు నిలుపుకోవ‌డంలోనే గ‌డ‌చిపోతోంది. ఆమెకు చిత్తూరు జిల్లాలో ఉన్న ఇద్ద‌రు మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, నారాయ‌ణ స్వామి ఇద్ద‌రితోనూ గ్యాప్ ఉంద‌న్న విష‌యం తెలిసిందే. ప‌దే ప‌దే ఈ మంత్రులు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జోక్యం చేసుకుంటున్నారంటూ రోజా ఎప్పుడూ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూనే ఉంటారు.

తాజాగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని నిండ్ర మండ‌ల ఎంపీపీ విష‌యంలో ఆమె వ్య‌తిరేక వ‌ర్గం.. సొంత పార్టీలోనే రోజా వ్య‌తిరేక వ‌ర్గం అండ‌దండ‌ల‌తో పాగా వేయాల‌ని చూసింది. అయితే ఈ విష‌యంలో తీవ్ర ప‌ట్టుద‌ల‌కు పోయిన రోజా ఎంపీపీ ఎన్నిక‌ను వాయిదా వేయించారు. ఈ రోజు ఎట్ట‌కేల‌కు తాను కోరుకున్న వ్య‌క్తికే ఎంపీపీ ప‌ద‌వి ద‌క్కేలా చేసి త‌న ప‌ట్టు నిలుపుకున్నారు. గ‌త నెల చివ‌ర్లోనే ఏపీలో ఎంపీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యాయి. అప్పుడే ఎంపీపీ, వైఎస్ ఎంపీపీల‌ను ఎన్నుకున్నారు.

అయితే నిండ్ర మండ‌లంలో పార్టీలో ఆధిప‌త్య పోరుతో ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా ప‌డింది. ఇక్క‌డ మొత్తం 8 ఎంపీటీసీలు ఉంటే 7 చోట్ల వైపీపీ, ఒక చోట టీడీపీ గెలిచాయి. ఎంపీపీగా రోజా ఎల‌కాటూరు ఎంపీటీసీ దీప‌ను నిర్ణ‌యించారు. అయితే శ్రీ‌శైలం బోర్డు చైర్మ‌న్ రెడ్డివారి చ‌క్ర‌పాణిరెడ్డి చ‌క్రం తిప్ప‌డంతో రోజా ఎంపిక చేసిన దీప‌కు ప‌ద‌వి రాలేదు. చివ‌ర‌కు మండ‌ల ప‌రిష‌త్ హాలులోనే రోజా చ‌క్ర‌పాణి రెడ్డితో పాటు ఆయ‌న త‌మ్ముడు భాస్క‌ర‌రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. మీరు మ‌గాళ్లు అయితే ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి త‌న‌తో త‌ల‌ప‌డాల‌ని స‌వాల్ రువ్వారు.

చివ‌ర‌కు అటు రోజా, ఇటు చ‌క్ర‌పాణి వ‌ర్గం అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నారు. చివ‌ర‌కు అధిష్టానం సూచ‌న‌ల‌తో జిల్లా నాయ‌క‌త్వం రంగంలోకి దిగింది. రోజా చెప్పిన దీప‌కే మ‌ద్ద‌తు ఇచ్చేలా చ‌క్ర‌పాణి వ‌ర్గాన్ని ఒప్పించ‌గ‌లిగింది. చివ‌ర‌కు రోజా పంతం నెగ్గించుకుంది.