Begin typing your search above and press return to search.

రోజాకు కొత్త జిల్లాల త‌ల‌నొప్పి

By:  Tupaki Desk   |   30 Jan 2022 9:30 AM GMT
రోజాకు కొత్త జిల్లాల త‌ల‌నొప్పి
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క‌ట‌న‌తో కొత్త అంశాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఓ వైపు జిల్లాల పేర్లు, వాటి ప‌రిధి, ఇత‌ర విష‌యాల‌పై వివాదాలు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా జిల్లాల పేర్లు, జిల్లా కేంద్రాల విష‌యంలో ప‌లు డిమాండ్లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు రాజ‌కీయంగానూ కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలో ఉన్న 13 జిల్లాల‌ను 26గా చేస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఈ జిల్లాల ఏర్పాటు జ‌రిగింది. అయితే ఈ కొత్త జిల్లాల రాక‌తో మంత్రి ప‌దవి ఆశిస్తున్న రోజా లాంటి నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డింద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

న‌గ‌రిలో వ‌రుస‌గా రెండోసారి గెలిచిన రోజా జ‌గ‌న్ అధికారంలోకి రాగానే మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశించారు. కానీ అప్పుడు జ‌గ‌న్ ఆమెను ప‌క్క‌న‌పెట్టారు. ఆమెను శాంత‌ప‌రిచేందుకు ఏపీఐఐసీ ఛైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. కానీ రెండో విడ‌త‌లో క‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌నే ఆశ‌తో ఆమె ఉన్నారు. ఇప్ప‌టికే మంత్రి వ‌ర్గంలో మార్పుల కోసం జ‌గ‌న్ క‌స‌ర‌త్తులు పూర్తి చేశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఉగాదికి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉండొచ్చ‌ని అంటున్నారు. అంతా బాగానే ఉంది అనుకునే స‌మ‌యంలో ఇప్పుడు ఈ కొత్త జిల్లాల ఏర్పాటు రోజాకు ఇబ్బందిగా మారుతుంద‌నే టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు కొత్త‌గా ఏర్ప‌డిన చిత్తూరు జిల్లాలో చిత్తూరు, పుంగ‌నూరు, ప‌ల‌మ‌నేరు, న‌గ‌రి, జీడీ నెల్లూరు, పూత‌ల‌ప‌ట్టు, కుప్పం నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. చిత్తూరు నుంచి ఇప్ప‌టికే మంత్రిగా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఉన్నారు. ఏ ఎన్నిక‌లు జ‌రిగినా పార్టీని గెలిపించే వ్యూహాలు ర‌చిస్తున్నా ఆయ‌న్ని జ‌గ‌న్ మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించే సాహ‌సం చేయ‌ర‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఒక్కో జిల్లా నుంచే ఒక్కో మంత్రి మాత్ర‌మే ఉండాలంటే న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకు మ‌ళ్లీ నిరాశ త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

అదే స‌మ‌యంలో చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డికి మాత్రం మంత్రి అవ‌కాశం వ‌చ్చి ప‌డే వీలుంది. తిరుపతి కేంద్రంగా కొత్త‌గా ఏర్ప‌డే శ్రీ బాలాబీ జిల్లాలో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని చేర్చారు. ప్ర‌స్తుతం దానికి భాస్క‌ర‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. శ్రీ బాలాజీ జిల్లాలో తిరుప‌తి, శ్రీ కాళ‌హ‌స్తి, స‌త్య‌వేడు, సూళ్లూరుపేట‌, గూడూరు, వెంక‌ట‌గిరి, చంద్ర‌గిరి నియోజ‌వ‌క‌ర్గాలున్నాయి. దీంతో భాస్క‌ర‌రెడ్డికి మంచి ఛాన్స్ వ‌చ్చింద‌ని చెప్పుకుంటున్నారు. జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వుల‌ను కొత్త జిల్లాల వారీగా కేటాయిస్తే మాత్రం రోజాకు మ‌ళ్లీ నిరాశ త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.