Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ అప్ క‌మింగ్‌!...బాబు అవుట్ గోయింగ్!

By:  Tupaki Desk   |   27 Feb 2019 5:32 AM GMT
జ‌గ‌న్ అప్ క‌మింగ్‌!...బాబు అవుట్ గోయింగ్!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిపై వైసీపీ ఫైర్ బ్రాండ్‌ - చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా మ‌రోమారు ఒంటికాలిపై లేచారు. ప‌ద‌వి దిగి ఇంటికెళ్లే రోజు చంద్ర‌బాబు అతి ద‌గ్గ‌ర్లోనే ఉంద‌ని త‌న‌దైన శైలి సెటైర్లు సంధించిన రోజా... చంద్ర‌బాబును జ‌గ‌న్ తో పోల్చి చెడుగుడు ఆడేశారు. కాసేప‌టి క్రితం న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి స‌మీపంలో సొంత ఇంటితో పాటు పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని సిద్ధం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. అందులోకి లాంఛ‌నంగా అడుగు పెట్టారు. ఈ సంద‌ర్భంగా పార్టీ కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో ఈ కార్య‌క్ర‌మానికి హాజర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో చాలా ఉత్సాహంగా పాలుపంచుకున్న రోజా... అక్కడే మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు తీరుపై త‌న‌దైన రీతిలో ఫైరైపోయారు.

జ‌గ‌న్‌ ను అప్ క‌మింగ్ సీఎంగా అభివ‌ర్ణించిన రోజా... చంద్ర‌బాబును అవుట్ గోయింగ్ సీఎంగా తేల్చేశారు. మొత్తంగా చంద్ర‌బాబు గ‌ద్దె దిగ‌నుండ‌గా - రాజ‌న్న రాజ్యాన్ని మ‌రోమారు అమ‌ల్లోకి తెచ్చేందుకు వైఎస్ జ‌గ‌న్ సీఎం కానున్నార‌ని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా రోజా చాలా అంశాల‌నే ప్ర‌స్తావించారు. అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి రాజ‌ధానిగా తీర్చిదిద్దుతానంటూ ప్ర‌గ‌ల్బాలు ప‌లుకుతున్న చంద్ర‌బాబు... ఇప్ప‌టిదాకా అమ‌రావ‌తిలో సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేక‌పోయార‌ని మండిప‌డ్డారు. హైద‌రాబాద్ లో కోట్లాది రూపాయల‌తో ఇల్లు నిర్మించుకున్న చంద్ర‌బాబు.. క‌నీసం ఆ ఇంటి ప్ర‌వేశానికి కూడా ఏ ఒక్క‌రినీ పిలవ‌లేద‌ని నిందించారు. ఇక అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు నివ‌సిస్తున్న గృహంతో పాటు అసెంబ్లీ - స‌చివాల‌యం త‌దిత‌రాల‌న్నీ కూడా తాత్కాలిక‌మేన‌న్న విష‌యాన్ని ఆమె మ‌రోమారు గుర్తు చేశారు.

హైద‌రాబాద్‌ లో పాత ఇంటిని ఆధునిక హంగుల‌తో నిర్మించుకున్న చంద్ర‌బాబు.. అమ‌రావ‌తిలో సొంతింటిని ఎందుకు నిర్మించుకోలేద‌ని ఆమె ప్ర‌శ్నించారు. రాజ‌ధానిలో సొంత ఇంటితో పాటు పార్టీ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకోవ‌డం ద్వారా జ‌గ‌న్ అమ‌రావ‌తికి వ్య‌తిరేక‌మ‌ని విమ‌ర్శ‌లు చేస్తున్న వారికి గృహ ప్ర‌వేశ కార్య‌క్ర‌మం ఓ చెంప‌పెట్టులాంటిద‌ని కూడా రోజా స్ప‌ష్టం చేశారు. రాజ‌ధానిపై ఎవ‌రు - ఏ విధమైన వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విష‌యం ప్ర‌జ‌లంద‌రికీ తెలిసింద‌ని కూడా రోజా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.