Begin typing your search above and press return to search.

ఎండలు మండే వేళలో కరోనాకు ఏం జరగకుంది?

By:  Tupaki Desk   |   28 March 2020 12:30 AM GMT
ఎండలు మండే వేళలో కరోనాకు ఏం జరగకుంది?
X
మందు లేని కరోనాతో యుద్ధం చేస్తున్న ప్రపంచం.. చుక్కాని లేని నావలా ప్రయాణం సాగుతోంది. ముందు అయితే పోరాడటం.. తర్వాత సంగతి తర్వాత అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుబాటులో ఉన్న మందుల్ని పలు కాంబినేషన్లలో కరోనా పాజిటివ్ కేసుల్లో ప్రయోగిస్తూ.. ఫలితాలు ఎలా వస్తున్నాయన్న విషయంపై ఒక కన్నేసి ఉంచుతున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ లు ప్రకటించటం.. దేశ వ్యాప్తంగా ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ఉండటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి.

అయితే.. వీటి కారణంగా జరిగే లాభం ఎంత? ఇప్పటికే పెరిగిన ఎండలు.. రానున్న రోజుల్లో మరింత పెరగనున్నాయి. మరి.. దాని కారణంగా జరిగే లాభం ఎంత? అన్నది ప్రశ్నగా మారింది. ఇలాంటివేళ.. పద్మభూషన్ పురస్కార గ్రహీత.. ఎయిమ్స్ లో కార్డియాలజీ విభాగం అధినేతగా పని చేసిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి. గతంలో ఇద్దరు ప్రధానమంత్రులకు వ్యక్తిగత వైద్యులుగా ఉన్న ఆయన.. ప్రస్తుతం ఒడిశా ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

అలాంటి ఆయన కరోనా వ్యాప్తి మీదా.. మనకున్న సవాళ్లు.. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటంలో అమెరికా.. ఇటలీ.. బ్రిటన్ దేశాలు నిర్లక్ష్యం చేశాయన్న ఆయన.. మన దేశంలోనూ ఆలస్యమైందా? అంటే చెప్పలేమన్నారు. జరిగిన దాని గురించి ఆలోచించే కన్నా.. జరగబోయే దాని గురించి ఆలోచించటం చాలా అవసరమన్నారు.

కరోనా కారణంగా అనుకోని పరిస్థితులు ఎదురైతే తట్టుకునే పరిస్థితుల్లో ఉన్నామా? అంటే లేదనే తాను చెబుతానని చెబుతున్నారు. ప్రభుత్వాలు దేశంలో ప్రజారోగ్య సేవల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని.. 38వేల మందికి ఒక వైద్యుడు.. 64,800 మందికి ఒక ఆసుపత్రి ఉందన్నారు. కరోనా వైరస్ వేళ.. వేగంగా.. సమర్థవంతంగా స్పందించే వ్యవస్థే లేదన్నారు. ఆరోగ్య రంగంలో నిపుణుల కొరత చాలా ఉందన్నారు.

వైరస్ సోకిన దేశాల్లో దాని వ్యాప్తిని అడ్డుకోవటంలో సక్సెస్ అయిన సింగపూర్.. దక్షిణ కొరియాలు అనుసరించిన విధానాల గురించి ఆయన ప్రస్తావించారు. ఆయా దేశాల్లో కరోనా లక్షనాలు లేని వారిని కూడా పరీక్షిస్తున్నారన్నారు. అలాంటి పరిస్థితులు మన దగ్గర లేవన్నారు. ఎవరికి వారు ఇళ్ల్లల్లో ఉండటం.. తొలిదశలోనే రోగుల్ని గుర్తించటం చాలా అవసరమన్నారు. ఐసోలేషన్ చర్యల్ని కొన్ని దేశాలు బాగా అమలు చేస్తున్నాయని.. ఇలాంటిచోట్ల వైరస్ వ్యాప్తి లేదన్నారు.

ఇప్పటికే ఎండలు మొదలై.. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండటం.. మేలో 50 డిగ్రీల సెల్సియస్ వరకూ వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యలో అంటువ్యాధుల వ్యాప్తి వేగంగా ఉండకపోవచ్చన్నారు. అలా అని వైరస్ వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. మండే ఎండల్లోనూ ఇది అవసరమన్నారు. పెరిగే ఉష్ణోత్రగతు మనకు సానుకూల అంశమే అయినా.. ఈ వైరస్ వ్యాప్తి ఎటు నుంచి ఎటు వెళుతుందో అంచనా వేయలేమన్నారు. సో.. మండే ఎండల్లోనూ ముప్పు ఉందన్న మాట ఆయన నోటి నుంచి రావటమే కాదు.. ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉండటానికి మించిన మంచి మందు లేదనే చెప్పాలి.