Begin typing your search above and press return to search.

తనను హింసించిన వారిని క్షమించిన రిషికేశ్వరి

By:  Tupaki Desk   |   25 July 2015 5:32 AM GMT
తనను హింసించిన వారిని క్షమించిన రిషికేశ్వరి
X
అచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించటం తెలిసిందే. ఈ ఆత్మహత్యలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకు రావటం తెలిసిందే. రిషికేశ్వరి ఆత్మహత్య వెనుక సీనియర్ల ఆరాచకం ఉందని.. వారు ఆమెను ఎంతగా వేధించారో ఆమె డైరీ చెప్పకనే చెప్పేసింది.

రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకోవటానికి కారణం.. హద్దులు దాటిన సీనియర్ల ఆరాచకమే. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. సీనియర్ల మాట విని.. సీనియర్ అమ్మాయిలు.. రిషేశ్వరిని అర్థనగ్నంగా హాస్టల్ కారిడార్ లలో తిప్పటం.. దాన్ని వీడియో తీయటం.. వాటిని సీనియర్లకు షేర్ చేయటం లాంటి పనులు చేయటంతో తీవ్రమైన మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుంది.

తన చివరి మాటల్లో.. ఆమె చెప్పిన విషయాలు మనసున్న ప్రతిఒక్కరిని కదిలించేలా ఉన్నాయి. చదువు కోసం వరంగల్ నుంచి తాను నాగార్జున యూనివర్సటీకి వస్తే.. ఇక్కడి సీనియర్లు తనను ప్రేమలోకి దించేందుకు ప్రయత్నించారని చెప్పుకొచ్చింది. తాను వారికి లొంగకపోయేసరికి తనపై పలు పుకార్లు పుట్టించారని.. వాటిని వింటేనే ఏడుపు వచ్చేదని చెప్పింది.

తండ్రి దగ్గర ఏమీ దాచని తాను.. తనకు ఎదురైన వేధింపుల గురించి తండ్రికి చెప్పలేకపోయేదానినని వేదన చెందిన రిషికేశ్వరి.. పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమగా పెంచకూడదని.. ప్రేమానురాగాల మధ్య పెరిగిన పిల్లలు.. బయటకు వెళితే.. ఎన్ని కష్టాలు ఎదుర్కొంటారో తాను అనుభవించినట్లు పేర్కొంది.

తన కోసం తల్లిదండ్రుల్ని ఏడ్వొద్దని అభ్యర్థించిన రిషికేశ్వరి.. తన అవయువాల్ని దానం చేయాలని అభ్యర్థించింది. తన సీనియర్లలో దీప.. అవినాశ్.. లావణ్య.. ప్రసాద్ లు చాలా మంచి వారని.. వారు చేసిన సాయాన్ని మర్చిపోలేనని చెప్పిన ఆమె.. తన ఆత్మహత్యకు కారణమైన వారు.. తమ తప్పుల్ని తెలుసుకొని మరొకరిని వేధించుకుంటే చాలంది. తాను మరణిస్తూనే.. తన మరణానికి కారణమైన వారిని క్షమించటం రిషికేశ్వరికే చెల్లింది.