Begin typing your search above and press return to search.

'పద్మభూషణ్' అందుకున్న అత్తగారికి అల్లుడైన బ్రిటన్ ప్రధాని ఏం చెప్పారు

By:  Tupaki Desk   |   8 April 2023 8:00 AM GMT
పద్మభూషణ్ అందుకున్న అత్తగారికి అల్లుడైన బ్రిటన్ ప్రధాని ఏం చెప్పారు
X
సుధామూర్తి అన్నంతనే చాలామంది గుర్తు పట్టేస్తారు. ఇన్ఫో సుధామూర్తి అంటే నూటికి నూరుశాతం గౌరవ మర్యాదలతో రియాక్టు అయ్యే వ్యక్తిత్వం ఆమె సొంతం. దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైతే నారాయణమూర్తి సతీమణిగా అందరికి తెలిసినప్పటికీ.. ఆమెకంటూ ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి.

విద్యావేత్తగా.. రచయిత్రిగా.. భారీ ఎత్తున విరాళాలు ఇచ్చేందుకు ఏ మాత్రం తగ్గని సుధామూర్తికి దేశంలోనే అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన పద్మభూషన్ పురస్కారాన్ని తాజాగా బహుకరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్.. లైబ్రరీ వసతుల్ని కల్పించటంతో పాటు.. పలు అనాథాశ్రమాలను నెలకొల్పిన ఆమె ఎన్నోసామాజిక సేవా కార్యక్రమాల్ని చేపట్టారు. తాజాగా పద్మ పురస్కారాన్ని అందుకున్న నేపథ్యంలో.. ఆమె అల్లుడు.. బ్రిటన్ ప్రధానిగా వ్యవహరిస్తున్న రిషి సునాక్ స్పందించారు. ఇక.. సుధామూర్తి గారాలపట్టి అక్షతామూర్తి సైతం తన తల్లికి దక్కిన గౌరవానికి మురిసిపోతూ.. ఇన్ స్టాలో పోస్టు పెట్టారు.

రాష్ట్రపతి నుంచి తన తల్లి పద్మభూషణ్ ను అందుకున్న క్షణాలను చూసి తానెంతో గర్వపడినట్లుగా పేర్కొన్నారు. సమాజం కోసం ఆమె చేసిన సేవకు ఈ పురస్కారాన్ని పొందారన్నారు. ఆమె జీవితం తనకో ఉదాహరణగా చెప్పారు. తన తల్లి గుర్తింపు కోసం ఎప్పుడు ఎదురుచూడలేదన్న ఆమె.. తన తల్లికి దక్కిన గుర్తింపు మాత్రం తనకో గొప్ప అనుభూతిని ఇచ్చినట్లుగా వెల్లడించారు. తన అత్తగారి గురించి తన సతీమణి పెట్టిన పోస్టుపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. ‘గర్వించదగ్గ రోజు’’ అంటూ వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.