Begin typing your search above and press return to search.

సునాక్ మనోడే.. గతంలో భారత్ మీద చేసిన వ్యాఖ్యలు ఏమిటో తెలుసా?

By:  Tupaki Desk   |   26 Oct 2022 4:45 AM GMT
సునాక్ మనోడే.. గతంలో భారత్ మీద చేసిన వ్యాఖ్యలు ఏమిటో తెలుసా?
X
ఆ మధ్య జరిగిన బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి జరిగిన పోటీ గురించి.. తాజాగా బ్రిటన్ పీఠాన్ని సొంతం చేసుకున్న రిషి సునాక్ గురించి భారతీయులు.. భారత మీడియా స్పందిస్తున్న వైనాన్ని చూస్తేనే ఉన్నాం. వందల ఏళ్లు మనల్ని ఏలిన తెల్లదొరల రాజ్యానికి మనోడు అధిపతి అయ్యాడన్న సంతోషం చాలామందిలో వ్యక్తమవుతోంది. దీన్ని తప్పు పట్టలేం. ఇంతకూ భారత మూలాలు ఉన్న రిషి.. భారతదేశం గురించి పలు సందర్భాల్లో ఆయనేం మాట్లాడారు? అదే సమయంలో చేతల్లో ఏం చేశారు. తన జీవిత భాగస్వామి నేరుగా భారతదేశానికి చెందిన మహిళే అయిన వేళ.. ఆయన తన అత్తారింటికి ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటి? అన్నది కూడా చూడాల్సిందే.

ముందుగా.. రిషి సునాక్ భారత్ గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు.. కీలక పదవుల్ని చేపట్టిన సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరును చూస్తే.. రాబోయే రోజుల్లో భారత్ విషయంలో ఆయన ప్రాధాన్యత ఎలా ఉండనుంది? అన్న దానిపై క్లారిటీ రావటం ఖాయం. ముందుగా.. భారత్ గురించి రిషి పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల్ని చూద్దాం.

- భారత్ తో 'ఎఫ్ టీఏ'కు కట్టుబడి ఉన్నాం. ఇది రెండు దేశాలకు ప్రయోజనకరం. ఉద్యోగాల కల్పనకూ ఇది దోహదపడుతుంది. భారత్ లో బీమా లాంటి ఆర్థిక సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. విదేశీ కంపెనీలు తమ కంపెనీలతో కలిసి పని చేసేలా భారత్ ఇలాంటి రంగాన్ని మరింత సరళీకరించాలి.

- బ్రిటన్ విద్యార్థులు భారత్ కు వెళ్లి నేర్చుకునేలా.. మన కంపెనీలు.. భారతీయ కంపెనీలు కలిసి నడిచేలా చేయాలనుకుంటున్నాను. రెండు దేశాల మధ్య బంధం పరస్పర సహకారంతో సాగాలని కోరుకుంటున్నా.

- భారత్ - యూకే సంబంధాలు ఇప్పుడు సమఉజ్జీల మధ్య భాగస్వామ్యం లాంటివి. ఇందులో ఎవరు ఎక్కువ కాదు.. తక్కువా కాదు.

- భారత్ లో ఏం అమ్మొచ్చో.. ఏం చేయొచ్చో అని మాత్రమే కాదు.. భారత్ నుంచి బ్రిటన్ ఏం నేర్చుకోవాలో చూడాలి.

- ప్రపంచ స్థాయి ఆలోచనలు.. ఆవిష్కరణలకు రెండు దేశాలు అవకాశాల్ని కల్పించుకోవాలి.

- ప్రపంచంలో బలమైన.. సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థగా సంప్రదింపుల్లోపెత్తనం చెలాయించే సహజ హక్కు బ్రిటన్ కు ఇప్పుడు లేదు. ఆ హక్కును మనం సంపాదించుకోవాలి. భారత్ లో ప్రస్తుతం 90కోట్ల మంది 35 ఏళ్ల లోపు వారు ఉన్నారు. వారంతా చాలా తెలివైనవారు. అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నారు. వారిని బ్రిటన్ ఆకర్షించాలి.

ఈ మాటల్ని విన్నప్పుడు భారత్ పట్ల రిషి సానుకూలంగా ఉన్నట్లుగా అనిపిస్తే.. అది అతని తెలివితేటలుగా మాత్రమే భావించాలి. ఎందుకంటే.. తన మూలాలు ఉన్న దేశం గురించి మాట్లాడుతూనే.. తన తొలి ప్రాధాన్యత బ్రిటన్ అన్న విషయాన్ని ఆయన తరచూ స్పష్టం చేస్తుంటారు. ఆయన మాటలు చేదు నిజాన్ని దాచే తీపి కోటింగ్ మాదిరి ఉంటాయి. భారత్ గురించి ఆయన మాటలు కాస్తంత సానుకూలంగా ఉన్నప్పటికీ.. ఆయన చేతలు మాత్రం పక్కా బ్రిటన్ దేశస్తుడి మాదిరే ఉంటాయి. పార్లమెంటులో ఆయన అడుగు పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు తాను చేసిన ప్రసంగాల్లో ఎప్పుడూ భారత్ తో బలమైన సంబంధాలపై పెద్దగా మాట్లాడింది లేదన్న నిజాన్ని మర్చిపోకూడదు.

అంతేకాదు.. బ్రిటన్ ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన వేళలోనూ.. ఎన్నడూ భారత్ ను అధికారికంగా పర్యటించింది లేదు. ఒకప్పుడు బ్రిటిష్ వలస రాజ్యంగా ఉన్న భారత్ ను ఇప్పుడు అలా చూడటం కుదరదన్న విషయంపై ఆయన పూర్తి క్లారిటీతో ఉండటం కనిపిస్తుంది. అదే సమయంలో.. భారత్ కు ఏదో మేలు చేద్దామన్న భావనను అతడు ప్రదర్శించింది లేదు. తనను నమ్మి తనకు అధికార పీఠాన్ని అప్పజెప్పిన దేశానికి కమిట్ మెంట్ తో వ్యవహరించేందుకే అతడు ప్రాధాన్యత ఇస్తాడదన్నది మర్చిపోకూడదు. భారత్ మూలాలు అతడిలో ఉండటం జస్ట్ యాక్సిడెంట్ మాత్రమే. అది ఉన్నందున భారత్ కు ప్రత్యేకమైన మేలు జరుగుతుందని ఆశించటం అత్యాశే అవుతుంది. ఈ విషయాన్ని తన చేతలతో రిషి ఎప్పుడో చూపించేశాడు. ఇకపై.. చూపిస్తాడు కూడదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.