Begin typing your search above and press return to search.

లిజ్ ప్రధానిగా.. మీరు మంత్రిగా ఆమెతో వర్కు చేస్తారన్న ప్రశ్నకు రిషి జవాబిదే!

By:  Tupaki Desk   |   24 Aug 2022 11:02 AM IST
లిజ్ ప్రధానిగా.. మీరు మంత్రిగా ఆమెతో వర్కు చేస్తారన్న ప్రశ్నకు రిషి జవాబిదే!
X
ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న బ్రిటన్ ప్రధానమంత్రి ఎన్నిక వ్యవహారం.. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ లో పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. బ్రిటన్ ప్రధానమంత్రి తుది పోరులో నిలిచిన ఇద్దరు అభ్యర్థుల్లో రిషి సునాక్ భారత మూలాలు ఉన్న వ్యక్తి కావటంతో.. అతడు బ్రిటన్ ప్రదాని అయితే బాగుండదన్న అభిప్రాయం పెద్ద ఎత్తున వినిపిస్తోంది.

వందల ఏళ్లు భారత్ ను పాలించిన దేశానికి.. భారత మూలాలున్న వ్యక్తి ప్రధాని కావటానికి మించిన అద్భుతమైన విషయం ఏముంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో తొలుత తన అధిక్యతను క్లియర్ గా ప్రదర్శించిన సునాక్.. చివరి రౌండ్ లో మాత్రం లిజ్ ట్రస్ కంటే కాస్తంత వెనకబడినట్లుగా కనిపిస్తోంది. అయినప్పటికి వెనక్కి తగ్గకుండా.. ఆఖరి క్షణం వరకు తాను ప్రయత్నిస్తూనే ఉంటానంటూ రిషి పని చేస్తున్నారు.తాజాగా ఆయనకు ఓ కీలకమైన ప్రశ్న ఎదురైంది. ఒకవేళ లిజ్ ట్రస్ ప్రధానమంత్రి అయితే.. ఆమె ప్రభుత్వంలో మీరు మంత్రిగా పని చేస్తారా? అని రిషిని ప్రశ్నిస్తున్నారు.

దీనికి సమాధానం ఇచ్చారు రిషి. 'కొంతకాలంగా ప్రభుత్వంలో ఉన్న నాకో విషయం అర్థమైంది. ఇక్కడ కొన్నిసార్లు పెద్ద విషయాలతో ఏకీభవించాల్సి ఉంటుంది. అలాంటి వాటికి మనం అనుకూలంగా లేకపోతే.. ఆ పరిస్థితులు చాలా కష్టంగా మారతాయి.

అందుకే.. నేను మరోసారి అలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవాలని అనుకోవటం లేదు' అని రిషి సమాధానం ఇచ్చారు. తన జవాబుకు కారణం లేకపోలేదన్న విషయాన్ని ఆయన గతమే ఒక పెద్ద ఉదాహరణగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన రిషి.. తన పదవికి రాజీనామా చేయటం.. చివరకు బోరీస్ సైతం ప్రధానమంత్రి పదవికి దూరయ్యే పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిషి నోటి నుంచి ఆ తరహాలో వ్యాఖ్యలు వచ్చి ఉంటాయని చెబుతున్నారు. ఇకపోతే.. లిజ్ కానీ ప్రధాని అయితే.. రిషిని ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతున్న వేళ.. అలాంటి అవకాశం తక్కువన్న విషయాన్ని ఆయన తాజా మాటలతో తేల్చేశారని చెప్పక తప్పదు.