Begin typing your search above and press return to search.

ముంబై ఆసుపత్రికి రిషబ్ పంత్.. పరిస్థితి ఎలా ఉందంటే?

By:  Tupaki Desk   |   4 Jan 2023 3:17 PM GMT
ముంబై ఆసుపత్రికి రిషబ్ పంత్.. పరిస్థితి ఎలా ఉందంటే?
X
టీం ఇండియా యువ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఇటీవల ఢిల్లీలో కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ కు నుదురు చిట్లడంతో తీవ్ర రక్తస్రావం జరగడంతో పాటు బాడీలోని పలుచోట్ల గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానికులు డెహ్రడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రిషబ్ పంత్ నుదుటికి స్వల్పంగా ప్లాస్టిక్ సర్జరీ చేసిన సంగతి తెలిసిందే.

రిషబ్ పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. అతడికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ ను డెహ్రాడూన్ లోని మాక్స్ ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం ముంబై తరలించారు. ఈ విషయాన్ని ఢిల్లీ క్రికెట్ బోర్డు డైరెక్టర్ శ్యామ్ శర్మ తాజాగా వెల్లడించారు.

ఈక్రమంలోనే బీసీసీఐ వైద్య బృందం సమక్షంలో పంత్ కుడికాలు లిగ్మెంట్‌కు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. మోకాలి ఎముకకు అయిన గాయం చాలా తీవ్ర మైందని.. దీని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారని శ్యామ్ శర్మ వెల్లడించారు. పంత్ ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల పూర్తి సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

ఇదే కనుక నిజమైతే ఐపీఎల్ 2023 సీజన్‌తోపాటు వచ్చే నెలలో జరిగే ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కి దూరం కానున్నాడు. అదేవిధంగా ఆ తర్వాత జూన్.. జూలై నెలల్లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌కి సైతం దూరం కావడం ఖాయం కన్పిస్తోంది. మరోవైపు రిషబ్ పంత్ ఆరు నెలలు తర్వాత గాయం నుంచి కోలుకొని ఫిట్ నెస్ సాధించడానికి సమయం తీసుకుంటే మాత్రం అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి సైతం అతడు అందుబాటులోకి రావడం కష్టం కానుంది.

ఈ క్రమంలోనే రిషబ్ పంత్ ఆరోగ్యంపై భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ స్పందించారు. రిషబ్ త్వరగా కోలుకొని తిరిగి తన ఆట కొనసాగించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ‘‘పంత్‌ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.. జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి.. వాటిని ఎదుర్కొని నువ్వు ముందుకు సాగాలి.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని’’ గంగూలీ ట్వీట్ చేశాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.