Begin typing your search above and press return to search.

కోనసీమ అల్లర్లు.. ప్రభుత్వం అనుకున్నట్టే విచారణ సాగుతోందిగా!

By:  Tupaki Desk   |   27 May 2022 3:29 AM GMT
కోనసీమ అల్లర్లు.. ప్రభుత్వం అనుకున్నట్టే విచారణ సాగుతోందిగా!
X
ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంలో రెండు రోజుల క్రితం జరిగిన అల్లర్లు, విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీడియో క్లిప్పింగుల ఆధారంగా 70 మందికిపైగా నిందితులను గుర్తించారు. ఇందులో భాగంగా గురువారం (మే 26న) ఒక్కరోజే 19 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఒక్కరు తప్ప మిగతా 18 మంది టీడీపీ, జనసేన, బీజేపీ వారేనని పోలీసులు చెబుతున్నారు. మరో ఒకరు తటస్తుడు అని వివరిస్తున్నారు. ఈ 19 మంది కాకుండా మరో 46 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై వివిధ సెక‌్షన్ల కింద ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ప్రత్యేక బృందాల ద్వారా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

మే 24న అమలాపురం పట్టణంలో పలు కూడళ్లలో ఉన్న సీసీ పుటేజ్‌లు, వాట్సాప్‌ గ్రూపులు, టీవీల వార్తల్లో ప్రసారమైన దృశ్యాల ఆధారంగా చేసుకుని నిందితులను గుర్తించారని అంటున్నారు. అలాగే అల్లర్లకు ప్రేరేపించిన 12 వాట్సాప్‌ గ్రూపులను గుర్తించారు. ఈ వాట్సాప్‌ గ్రూపుల్లో ఆందోళనకారులు పరస్పర సమాచారం చేర వేసుకుంటూ.. ఫలానా చోటకు రావాలని, ఫలానా చోట పోలీసుల బందోబస్తు అధికంగా ఉందని.. అడ్డదారుల్లో రావాలని ఆ దారులు తెలియజేస్తూ గ్రూపుల్లో సమాచారం పంపించారని పోలీసులు చెబుతున్నారు. ఈ 12 వాట్సాప్‌ గ్రూపుల్లో ఆ రోజు సాగిన పోస్టింగ్‌లు, మెసేజ్‌లు సేకరించారని తెలుస్తోంది. వాట్సాప్‌ గ్రూపుల అడ్మిన్‌లపైనా కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

మంత్రి పినిపే విశ్వరూప్, అధికార పార్టీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఇళ్లపై ఆందోళనకారులు ఉద్దేశపూర్వకంగా దాడి చేసి నిప్పుపెట్టారని పోలీసులు చెబుతున్నారు. నిందితులపై హత్యాయత్నంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, పథకం ప్రకారం దాడులు, దొమ్మి తదితర కేసులు నమోదు చేశామని వివరిస్తున్నారు. ఆందోళనకారులు అమలాపురంలోని నల్లవంతెన వద్ద పోలీసుల వజ్ర వాహనాన్ని ధ్వంసం చేయడంతోపాటు కలెక్టరేట్‌ వద్ద, ఎర్ర వంతెన వద్ద బస్సులను తగలబెట్టడం, తర్వాత వాట్సాప్‌ గ్రూపుల్లో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఇళ్లకు నిప్పు పెట్టాలని ఇలా అంతా పథక రచన చేసుకుని ఎర్రవంతెన వైపు నుంచి వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుల దర్యాప్తులో ఆరు పోలీసు బృందాలు ఉన్నాయని.. మరో ఆరు బృందాలు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించే పనిలో ఉన్నాయని పేర్కొంటున్నారు. దాడుల్లో రౌడీషీటర్ల పాత్ర ఉందని శుక్రవారం (మే 27న) మరో కొంత మందిని అరెస్టు చేస్తామని అంటున్నారు. అరెస్టులు మరికొన్ని రోజులపాటు ఉంటాయని వివరిస్తున్నారు.

గురువారం పోలీసులు అరెస్టు చేసిన 19 మంది నిందితుల్లో 18 మంది జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందినవారేనని పోలీసులు చెబుతున్నారు. టీడీపీ కార్యకర్తలు.. దున్నల తాతాజీ ధనుంజయ దిలీప్‌, అల్లబిల్లి సూర్యనారాయణమూర్తి, జనసేన పార్టీ కార్యకర్తలు.. అన్యం దుర్గా సాయికుమార్‌, కల్వకొలను సత్యనారాయణమూర్తి, కురసాల సురేష్‌ నాయుడు, నార్కెడిమిల్లి కృష్ణకిశోర్‌, అడ్డాల నాగ శ్రీరంగ గణేష్‌, చిట్టూరి ప్రసాద్‌, విత్తనాల శివనాగ మణికంఠ, ఎర్రంశెట్టి బాలాజీ, నల్లా సురేష్‌, విత్తనాల ప్రభాకర్‌, పలివెల శేఖర్‌, నేదునూరి వెంకటేష్‌, నడవపల్లి భవానీ శివశంకర్‌, కంచిపల్లి వెంకటేశ్వరరావు, బీజేపీ కార్యకర్తలు..సత్తిరెడ్డి సతీష్‌, ఎర్రంశెట్టి సాయిబాబులతోపాటు ఏ పార్టీకి చెందని వాసంశెట్టి రాము ఉన్నారు. వీరిలో 12 మంది అమలాపురం పట్టణానికి చెందినవారు కాగా అమలాపురం రూరల్‌ మండలానికి చెందినవారు ముగ్గురు, పి.గన్నవరానికి చెందినవారు ఇద్దరున్నారు. అల్లవరం, అయినవిల్లిలకు చెందినవారు చెరొకరు ఉన్నారు.

కాగా పోలీసుల దర్యాప్తుపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. అధికార పార్టీకి అనుకూలంగానే పోలీసులు విచారణ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందినవారిని కూడా ప్రతిపక్ష పార్టీల్లో కలిపేస్తూ, కొంతమందిని పూర్తిగా తప్పిస్తూ కథలు అల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లర్లు మొదలైన సమయంలోనే మీడియాతో మాట్లాడుతూ మంత్రులు, అధికార పార్టీ నేతలు అల్లర్లకు టీడీపీ, జనసేన పార్టీలే కారణమని ఆరోపించారని గుర్తు చేస్తున్నారు. అసలు విచారణ సాగకముందే, ఎలాంటి ఆధారాలు లేకుండానే హోం శాఖ మంత్రితో సహా అంతా అల్లర్లు జరిగిన రోజే తమపై నేరం మోపారని టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే అరెస్టు అయినవాళ్లంతా టీడీపీ, జనసేన వాళ్లేనంటూ పోలీసులు పనికిమాలిన డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.