Begin typing your search above and press return to search.

హెచ్ సీయూలో రైట్ వింగ్ ఓటమి.. లెఫ్టు వింగ్ విజయం

By:  Tupaki Desk   |   26 Feb 2023 12:00 PM GMT
హెచ్ సీయూలో రైట్ వింగ్ ఓటమి.. లెఫ్టు వింగ్ విజయం
X
దేశంలో ప్రతిష్ఠాత్మక సెంట్రల్ యూనివర్సిటీల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి. దేశ రాజకీయాల్ని సైతం ప్రభావితం చేసే ఉదంతాలు ఈ వర్సిటీల్లో అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి. కరోనాకు ముందు జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి విభాగమైన ఏబీవీపీకి చెందిన సభ్యులు విజయం సాధించటం తెలిసిందే. అప్పట్లో అదో చర్చగా మారింది. దాదాపు రెండేళ్ల పాటు ఎన్నికల్ని కరోనా కారణంగా నిర్వహించలేదు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం నిర్వహించిన విద్యార్థి సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం మొదలుపెట్టి.. రాత్రి వేళకు పూర్తి చేశారు. పోలింగ్ నిర్వహించిన శుక్రవారం రాత్రి వర్సిటీలో పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకోవటం తెలిసిందే.

ఏబీవీపీకి చెందిన పోస్టర్లను ఎస్ఎఫ్ఐకు చెందిన విద్యార్థి చించివేయటంతో మొదలైన వివాదం.. కొట్లాటలకు.. ఆస్తుల ధ్వంసాల వరకువెళ్లటం.. పలువురు విద్యార్థులు గాయాలబారిన పడటం తెలిసిందే. దీంతో.. వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు ఏకంగా 200 మంది పోలీసు సిబ్బందిని వర్సిటీలో మొహరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో రైట్ వింగ్ కు చెందిన ఏబీవీపీకి చెందిన ప్యానల్ ఓటమి పాలు కాగా.. లెఫ్టు వింగ్ కు చెందిన ఎస్ఎఫ్ఐ కూటమికి చెందిన ప్యానల్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎస్ఎస్ఐ, ఏఎస్ఏ, డీఎస్ యూ సంయుక్తంగా పోటీ చేశారు. దీంతో సత్ఫలితాలు వచ్చాయి. మొత్తం విద్యార్థుల్లో 5300 మంది విద్యార్థులకు ఓటుహక్కు ఉండగా.. వారిలో 76 శాతం మంది ఓటింగ్ లో పాల్గొన్నారు.

ఓట్ల లెక్కింపు విషయానికి వస్తే.. మొదటి నుంచి ఎస్ఎఫ్ఐ కు చెందిన అభ్యర్థులు అధిక్యతను కనపర్చారు. చివరకు వారే విజయాన్ని సాధించారు. ఎన్నికల్లో 1838 ఓట్లు సాధించిన విద్యార్థి స్టూడెంట్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన లెఫ్ట్ భావజాల విద్యార్థికి 1860 ఓట్లు వచ్చాయి. జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన మహిళా విద్యార్థినికి 2076 ఓట్లు రాగా.. జాయింట్ సెక్రటరీగా పోటీ చేసిన విద్యార్థికి 1678 ఓట్లు వచ్చాయి.

ముఖ్య పదవుల్ని సాధించిన విద్యార్థులు.. వారి స్థానాల్ని చూస్తే..

ప్రెసిడెంట్ ప్రజ్వల్

వైస్ ప్రెసిడెంట్ ప్రథ్వీ సాయి

జనరల్ సెక్రటరీ క్రిపా మారియా జార్జ్

జాయింట్ సెక్రటరీ లిఖిత్ కుమార్

స్పోర్ట్స్ సెక్రటరీ జయరాజ్