Begin typing your search above and press return to search.

తంబళ్ళపల్లిలో ముసలం

By:  Tupaki Desk   |   3 Jan 2022 2:00 PM IST
తంబళ్ళపల్లిలో ముసలం
X
తంబళ్లపల్లి నియోజకవర్గంలో జడ్పీటీసీ సభ్యురాలి భర్తను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అధికార పార్టీలో నేతల మధ్య గొడవలతో ముసలం మొదలైనట్లే ఉంది. ఎంఎల్ఏ పెద్దిరెడ్డి ద్వారక నాద రెడ్డికి జడ్పీటీసీ సభ్యురాలు గీత+ఆమె భర్త కొండ్రెడ్డికి పడటం లేదు. ఆ మధ్య ఎంఎల్ఏ వ్యవహరశైలిపై కొండ్రెడ్డి ఆరోపణలు చేశారు. దాంతో పోలీసులు ఎప్పటిదో కేసుకు దుమ్ము దులిపి ఇపుడు అరెస్టు చేయడం సంచలనంగా మారింది.

తన భర్తపై కక్ష సాధింపులకు దిగిన ఎంఎల్ఏ అరెస్టు చేయించినట్లు గీత వాపోతున్నారు. ఎంఎల్ఏ వైఖిరిని విమర్శిస్తే పోలీసులతో చెప్పి అరెస్టులు చేయిస్తారా అంటు నిలదీస్తున్నారు. ఎంఎల్ఏకి గీత దంపతులకు మధ్య ఏ విషయంలో గొడవలు మొదలయ్యాయో తెలీదు. కానీ గొడవలు పెరిగిపోయి ఇపుడు అరెస్టు దాకా పరిస్థితి దిగజారిపోయిన విషయం అర్ధమైపోతోంది. ఇపుడు గనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యం చేసుకుని సర్దుబాటు చేయకపోతే గొడవలు ఇక్కడితే ఆగేట్లు కనబడటం లేదు.

ఇప్పటికే నగిరి లో ఎంఎల్ఏ రోజా నానా అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఎంఎల్ఏ కి వ్యతిరేకంగా పార్టీ లోనే బలమైన ప్రత్యర్ధి వర్గం తయారైంది. ఎంఎల్ఏకి వ్యతిరేకం గా ప్రత్యర్ధివర్గం పార్టీ కార్యక్రమాల ను సమాంతరం గా నిర్వహిస్తున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఎంఎల్ఏ కి పోటీగా నిర్వహిస్తున్నారు. రోజా కూడా ప్రత్యర్ధి వర్గాన్ని సవాలు చేస్తున్నారు. ఇపుడు పరిస్థితి ఎలాగైపోయిందంటే రెండు వర్గాలు ఒకచోట కూర్చునే పరిస్థితి కూడా లేదు.

ఈ గొడవలు ఇలాగే కంటిన్యూ అయితే రేపటి ఎన్నికల్లో రోజా గెలవడం కూడా కష్టమే. ఎందుకంటే ప్రత్యర్ధి వర్గంలోని నేతలకు నగరి పట్టణంతో పాటు కొన్ని మండలాల్లో బలమైన అనుచరవర్గముంది. జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులతో ప్రత్యర్థి వర్గం బలంగా తయారైంది. అందుకనే వచ్చే ఎన్నికల్లో టికెట్ రోజాకు కాకుండా తమలో ఎవరికి ఇచ్చినా పార్టీని గెలిపించుకుంటామని గట్టిగా చెబుతున్నారు. అంటే టికెట్ విషయంలోనే రోజాకు సవాలు విసురుతున్నారు.

ఇలాంటి గొడవలు పై నియోజకవర్గాల్లోనే కాదు విశాఖపట్నం జిల్లాలోని పాయకరావు పేట, గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో కూడా మొదలైపోయాయి. గొడవలను ఆదిలోనే తుంచేయకపోతే ముందు ముందు ముదిరిపోవటం ఖాయమని అర్ధమైపోతోంది. దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు పై పడటం ఖాయం.