Begin typing your search above and press return to search.

దేవుళ్ల ఆదాయానికి భారీ గండి.. లెక్కలు తెలిస్తే అవాక్కే

By:  Tupaki Desk   |   13 May 2020 4:30 AM GMT
దేవుళ్ల ఆదాయానికి భారీ గండి.. లెక్కలు తెలిస్తే అవాక్కే
X
కొన్ని లెక్కలు వినేందుకు బాగుండవు. ఇలాంటి వాటిని కూడా కమర్షియల్ గా చూస్తారా? అన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేసే వారుంటారు. ప్రాక్టికల్ గా చూసినప్పుడు ఇవెంత అవసరమన్న విషయం.. వాటి మీద ఆధారపడిన వారి బతుకుల్ని చూసినప్పుడు అర్థమవుతుంది. దేవుడ్ని ఆదాయ వనరుగా చూడటమా? అన్న క్వశ్చన్ పలువురిలో కలుగుతుంది. కానీ.. తరచి చూస్తే.. దేవుడి చుట్టూ జరిగే వ్యాపారం అంతా ఇంతా కాదు. దాని మీద ఆధారపడి జీవించే వారు కోట్లాది మంది ఉంటారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలు మొదలు.. చిన్న గుళ్లు మూసివేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

చాలా వరకూ దేవాలయాల్లో ఆర్చకులు.. నిత్యం జరపాల్సిన పూజల్ని ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. భక్తుల్ని అనుమతించటం లేదు. ఇక.. నిత్యం లక్షలాది మందితో కళకళలాడిన దేవాలయాలు ఇప్పడు వెలవెలబోతున్నాయి. సమీప భవిష్యత్తులో సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయన్నది కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదాయం భారీగా దెబ్బ తినటంతో.. దేవాలయాల్లో పని చేసే సిబ్బంది ఇప్పుడు కొత్త తిప్పలు ఎదుర్కొంటున్నారు.

ప్రపంచంలో రోజు వారీగా అత్యధికంగా ఆదాయం వచ్చే దేవాలయాల్లో తిరుమల శ్రీవారి ఆలయం ఒకటిగా చెప్పొచ్చు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఆ దేవాలయంలో రోజువారీ ఆదాయం తక్కువలో తక్కువ రూ.3.5కోట్లుగా చెబుతారు. ఇంత భారీ ఆదాయం గడిచిన ఎనిమిది వారాలుగా లేకపోవటంతో.. టీటీడీలో పని చేస్తున్న సిబ్బందికి జీతాలు ఇచ్చే విషయంలోనూ సంస్థ ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికే ఇలాంటి ఇబ్బంది అయినప్పుడు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర దేవాలయాల పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఒక అంచనా ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దేవాలయాలకు రావాల్సిన ఆదాయం భారీగా పోయినట్లు చెబుతున్నారు. తిరుమల శ్రీవారిని లెక్కలోకి తీసుకోకుండా చూస్తే.. దగ్గర దగ్గర రూ.200 కోట్ల మేర ఆదాయాన్ని పోయినట్లు చెబుతున్నారు. హుండీ ఆదాయంతో పాటు.. ప్రసాదం.. ఇతర సేవలతో వచ్చే ఆదాయం.. విరాళాల్ని లెక్కలోకి తీసుకుంటే ఈ భారీ మొత్తం ఉంటుందని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గల్లీలోని గుడి దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆలయాల వద్ద.. వ్యాపారాలు నిర్వహించుకునే వ్యాపారుల పరిస్థితి దారుణంగా మారినట్లుగా చెబుతున్నారు. గుళ్లు ఎప్పుడు తెరుస్తారన్న విషయంపై క్లారిటీ లేకపోవటం.. ఆలయాల మీదనే ఆధారపడిన వ్యాపారుల బతుకులు ఇప్పుడు అయోమయంలో పడినట్లుగా చెప్పక తప్పదు.