Begin typing your search above and press return to search.

ఆ సీఎం కొడుకు లోక్‌ సభలో కుబేరుడు

By:  Tupaki Desk   |   1 Jun 2019 11:33 AM IST
ఆ సీఎం కొడుకు లోక్‌ సభలో కుబేరుడు
X
చట్టసభలు సంపన్నులతో నిండిపోతున్నాయి. ప్రతాప్ చంద్ర షడంగి వంటి నిరుపేద ఎంపీలు ఎన్నికైన లోక్‌ సభలోనే అపర కుబేరులూ కొలువు దీరుతున్నారు. జూన్ 17న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ లోక్‌ సభలో అత్యంత సంపన్నులు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. తాజా లోక్ సభలో అత్యంత ధనికులు ఎవరన్న చర్చకు వస్తే ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరేమో.. మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ కుమారుడు కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ కాగా ఇంకొకరు ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.

అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపిన వివరాల ప్రకారం నకుల్ నాథ్ ఆస్తుల విలువ రూ.660 కోట్లు. ఇప్పుడు కొలువుదీరనున్న లోక్ సభలో నకుల్ నాథ్ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన ఏడాదికి రూ.2.76 కోట్లు ఆదాయం ఆర్జిస్తున్నారట.నకుల్ నాథ్ లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నాథన్ షా కవ్రేటీపై 37,536 ఓట్లతో గెలిచారు. ఇక, అదే రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సభలోని నలుగురు అత్యంత పేద ఎంపీల్లో ఒకరిగా నిలిచారు. ఆమె తన ఆస్తులను ఎన్నికల అఫిడవిట్ లో రూ.4 లక్షలుగా చూపించారు.

నిజానికి.. నకుల్ నాథ్ కంటే కుబేరుడైన ఎంపీ ఒకరు లోక్‌ సభలో ఉన్నారు. ఆయన మన రాష్ట్రానికి చెందిన గల్లా జయదేవ్. ఆయన ఆస్తుల విలువ రూ.683 కోట్లుగా అఫిడవిట్లో చూపించారు. ఇక లోక్ సభలో అత్యంత నిరుపేద ఎంపీ ఎవరంటే రాజస్థాన్ లోని సికార్ నియోజకవర్గం నుంచి గెలిచిన సుమేదానంద సరస్వతి పేరు చెప్పాలి. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ.35 వేలు. ఆయన ఒక సాధారణ సన్యాసి.