Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్ పై ‘‘తుపాకీ’’ సింగిల్ షాట్

By:  Tupaki Desk   |   4 Aug 2016 10:48 AM GMT
ఒలింపిక్స్ పై ‘‘తుపాకీ’’ సింగిల్ షాట్
X
విశ్వ క్రీడా సంరంభానికి గట్టిగా 24 గంటల సమయం కూడా లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా వేడుకకు అంతా రెడీ అయిపోయారు. ఆటగాళ్లు.. పాటగాళ్లు.. అందమైన వేటగాళ్లతో బ్రెజిల్ వాణిజ్య రాజధాని రియో నగరం నిండిపోయింది. ప్రతిష్ఠాత్మక క్రీడలకు వచ్చేవారికి ఇక్కడ దొరకనది ఉండదు.. మామూలుగానే మజాలకు నెలవైన రియోలో ఇప్పు ప్రపంచ క్రీడా వేడుక జరుగుతుండడంతో క్రీడాభిమానులతో పాటు విందు - పొందు - మందు అన్నీ కోరుకునే పర్యాటకులూ వస్తున్నారు. రెండు వారాల పాటు జరిగే ఈ ప్రపంచ క్రీడా సమరం ఎంత గ్రాండ్ గా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే.. ఈ లెక్కలు చూడాల్సిందే.

- పాల్గొంటున్న దేశాలు: 206

- ఆటగాళ్లు: 7,500 మంది అథ్లెట్లు

- అథ్లెట్లు - అధికారులు - టెక్నిషియన్లు అంతా కలిసి: 10,500

- క్రీడలు: 28

- మొత్తం పతకాలు: 2488

- మొత్తం ఖర్చు: 77,300 కోట్ల రూపాయలు

- క్రీడాగ్రామాన్ని 5,624 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు.

- 31 ఆకాశ హార్మ్యాలు - 3604 బహుళ గదుల నివాసాలను ఏర్పాటు చేశారు.

- క్రీడా గ్రామంలో రెండు వారాల పాటు నివాసం ఉండే 18 వేల మంది అతిథుల కోసం.... షాపింగ్‌ మాల్స్‌ - ఆరోగ్య కేంద్రాలు - బ్యాంకులు - తపాలా కేంద్రాలు - వ్యాయామశాలలు - ఈత కొలనులు - ఉద్యానవనాలను తీర్చిదిద్దారు.

- మొత్తం 31 భవనాలలో 19 వేల పడకలతో పాటు 3 వేల 604 బహుళ గదుల గృహాలను ఏసీ సదుపాయలతో నిర్మించారు.

- ఈ గ్రామంలో నివాసం ఉండే అథ్లెట్లు 43 శాతం మంది కేవలం 10 నిమిషాలలో, 57 శాతం మంది 25 నిమిషాలలో ప్రధాన వేదికలు చేరేలా 400 వోల్వో బస్సులను అందుబాటులో ఉంచారు. ఈ బస్సులన్నీ 24 గంటలూ క్రీడా గ్రామంలో తిరుగుతూనే ఉంటాయి.

- క్రీడా గ్రామంలో నివాసం ఉండే అథ్లెట్లు - అధికారులకు వివిధ రకాల సేవలు అందించడం కోసం 13 వేల మంది వలంటీర్లను నియమించారు.

- రోజుకు 60 వేల మందికి భోజనాలు పెడతారు. క్రీడా గ్రామంలో అతిపెద్ద భోజనశాలను ఏర్పాటు చేశారు. ఇది బోయింగ్‌ 747 జంబో జెట్‌ విమానం పట్టేంత పెద్దగా ఉంటుంది. ఏక కాలంలో 5 వేల మంది కూర్చుని భోజనం చేసే సౌకర్యం ఉంది.

- ఈ సారి ఒలింపిక్‌ పతాకం కింద శరణార్థుల జట్టు కూడా ఒలింపిక్స్‌ లో పాల్గొంటోంది. జట్టులో సభ్యులు వివిధ దేశాలనుంచి శరణార్థులుగా శిబిరాలకు చేరిన వారే. సిరియా - సూడాన్‌ వంటి కల్లోలిత దేశాల నుంచి తమ కుటుంబాల భవిష్యత్తు కోసం ప్రాణాలు దక్కించుకునేందుకు శరణార్థులుగా మారిన వీరిలో అద్భుత ప్రతిభా పాటవాలకు కొదవ లేదు. వీరిని గుర్తించి ఒలింపిక్‌ కమిటీ క్రీడ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చారు.

వాట్ అబౌట్ ఇండియా..

- 1900 లో జరిగిన ప్యారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి లండన్‌లో ముగిసిన 2012 ఒలింపిక్స్‌ వరకూ.... భారత్‌ మొత్తం 23 సార్లు ఒలింపిక్స్‌ లో పాల్గొంది.

- ఆ తరువాత 1904 నుంచి 1916 ఒలింపిక్స్‌ కు దూరంగా ఉన్న భారత్‌.. యాంట్వార్ప్‌ వేదికగా 11920లో జరిగిన గేమ్స్‌ కు ముగ్గురు అథ్లెట్ల బృందాన్ని పంపింది. భారత అథ్లెట్లు ఒక్క పతకమూ గెలుచుకోలేకపోయారు. 1924 ప్యారిస్‌ ఒలింపిక్స్‌ లో ఏడుగురు సభ్యుల బృందంతో భారత్‌ పోటీకి దిగినా ఉట్టి చేతులతో తిరిగి రావాల్సి వచ్చింది.

- 1920 ఆమ్‌ స్టర్‌ డామ్‌ గేమ్స్‌ నుంచి ఒలింపిక్స్‌ లో క్రమం తప్పకుండా పొల్గొంటున్న భారత్‌ పరిస్థితి పతకాల సాధనలో అంతంత మాత్రంగానే ఉంది.

- మన జాతీయ క్రీడ హాకీలో మాత్రమే అత్యధికంగా ఎనిమిది బంగారు పతకాలు సాధించిన అరుదైన రికార్డు మాత్రం సొంతం చేసుకుంది.

- నాలుగేళ్ళ క్రితం ముగిసిన లండన్‌ ఒలింపిక్స్‌ లో 83 సభ్యుల బృందంతో 13 క్రీడాంశాలలో పోటీకి దిగిన భారత్‌ రెండు రజత - నాలుగు కాంస్య పతకాలతో పతకాల పట్టికలో 55వ స్థానంలో నిలిచింది.

- ఫ్రీస్టయిల్‌ కుస్తీలో సుశీల్‌ కుమార్‌ పిస్టల్‌ షూటింగ్‌ లో విజయ్ కుమార్‌ రజత పతకాలు సాధించగా.. మహిళల బాక్సింగ్‌ లో మేరీకోమ్‌ - బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ సైనా నెహ్వాల్‌ - కుస్తీలో యోగేశ్వర్‌ దత్‌ - షూటింగ్‌ లో గగన్‌ నారంగ్‌ కాంస్య పతకాలు సంపాదించారు.

- మొత్తం ఆరు పతకాలతో భారత్‌ మొదటి యాభై స్థానాలలో సైతం చోటు సంపాదించలేకపోయింది. అయితే 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ లో మూడు పతకాలు మాత్రమే గెలుచుకున్న భారత్‌... లండన్‌ ఒలింపిక్స్‌ లో పతకాల సంఖ్యను ఆరుకు పెంచుకోవడం గుడ్డిలో మెల్లగా చెప్పుకోవాలి.

రియోలో మనమేంటి..?

- ప్రస్తుత రియో ఒలింపిక్స్‌ 121 మంది సభ్యుల భారీ బృందంతో భారత్‌ పతకాల వేటకు సిద్ధమైంది. 15 క్రీడలు - 66 అంశాలలో భారత అథ్లెట్లు తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. వీరిలో 67 మంది పురుషుల - 54 మంది మహిళలు

- రియో ఒలింపిక్స్‌ పాల్గొంటున్న భారత అథ్లెట్లలో టెన్నిస్‌ పేస్‌ లియాండర్‌ పేస్‌ - మహిళల 100 మీటర్ల స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ అరుదైన రికార్డులతో బరిలోకి దిగబోతున్నారు. పురుషుల డబుల్స్‌ లో రోహన్‌ బొపన్న జంటగా లియాండర్‌ పేస్‌ పతకం వేటకు దిగబోతున్నాడు. పేస్‌ క్రీడా జీవితంలో రియో ఒలింపిక్స్‌ వరుసగా ఏడో గేమ్స్‌. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించిన అరుదైన రికార్డు లియాండర్‌ పేస్‌ కు మాత్రమే ఉంది. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ డబుల్స్‌ లో మహేశ్‌ భూపతితో జంటగా నాలుగో స్థానంలో నిలిచాడు.

పీటీ ఉష తరువాత మళ్లీ ఇన్నాళ్లకు..

- మహిళల 100 మీటర్ల పరుగులో ఒడిశా రన్నర్‌ ద్యుతీ చంద్‌ రియో ఒలింపిక్స్‌ కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది.1980 మాస్కో ఒలింపిక్స్‌ లో పీటీ ఉష పాల్గొన్న తర్వాత 100 మీటర్ల పరుగులో ఒలింపిక్స్‌ అర్హత సాధించిన ఘనత ద్యుతికి మాత్రమే దక్కింది. 36 ఏళ్ల విరామం తర్వాత ద్యుతీ ద్వారా భారత్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ సంపాదించింది.

- మహిళల హాకీలో భారత జట్టు 36 ఏళ్ల విరామం తర్వాత ఒలింపిక్స్‌ కు అర్హత సంపాదిస్తే..సర్దార్‌ సింగ్‌ నాయకత్వంలోని పురుషుల జట్టు ఏదో ఒక పతకం సాధించాలన్న పట్టుదలతో పోటీకి దిగుతోంది.

- బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ సైనా నెహ్వాల్‌ పీవీ సింధు - డబుల్స్‌ లో గుత్తా జ్వాలా-అశ్వనీ జోడీ - పురుషుల సింగిల్స్‌ లో కిడాంబి శ్రీకాంత్‌ - పురుషుల డబుల్స్‌ మను అత్రీ- సుమీత్‌ రెడ్డి జోడి తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.

- మహిళల విలు విద్యలో దీపికా కుమారి - షూటింగ్‌ లో అభినవ్‌ బింద్రా - విజరు కుమార్‌ - కుస్తీలో యోగేశ్వర్‌ దత్‌ బరిలో దిగుతున్నారు.

తొమ్మిదిలో 8 హాకీవే..

- 1928 ఆమ్‌స్టర్‌ డామ్‌ ఒలింపిక్స్‌ హాకీలో తొలిసారిగా పాల్గొన్న భారత జట్టు.. 1956 మెల్బోర్న్‌ ఒలింపిక్స్‌ వరకూ బంగారు పతకాలు గెలుచుకొంటూ తనకు తానే సాటిగా నిలిచింది. ఒలింపిక్స్‌ చరిత్రలోనే అత్యధికంగా ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించిన ఒకే ఒక్క దేశంగా ఈనాటికీ భారత్‌ నిలిచింది.

- ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ ఇప్పటి వరకూ సాధించిన తొమ్మిది బంగారు పతకాలలో హాకీ జట్టు అందించినవే ఎనిమిది పతకాలు.

- 1980 మాస్కో ఒలింపిక్స్‌ లో చివరిసారిగా హాకీ స్వర్ణం సాధించిన భారత్‌ ఆ తర్వాత పాతాళానికి పడిపోయింది. కనీసం ఒలింపిక్స్‌ కు అర్హత సాధించడమే కష్టంగా మారిపోయింది.

- మొత్తం 23 సార్లు ఒలింపిక్స్‌ లో పాల్గొన్న భారత్‌ 17 గేమ్స్‌ లో మాత్రమే ఏదో ఒక పతకం గెలుచుకొంటూ వచ్చింది.

- ఆరుసార్లు భారత్‌ శూన్య హస్తాలతో తిరిగి రావాల్సి వచ్చింది.

- 1900 ప్యారిస్‌ నుంచి 2012 లండన్‌ ఒలింపిక్స్‌ వరకూ భారత జట్లు - అథ్లెట్లు కలిసి మొత్తం 26 పతకాలు అందించారు. ఇందులో 9 బంగారు - 6 రజత - 11 కాంస్య పతకాలు ఉన్నాయి.

- 23 ఒలింపిక్స్‌ గేమ్స్‌ లో భారత్‌ సాధించిన మొత్తం 26 పతకాలలో వ్యక్తిగతంగా భారత్‌ ఒకే ఒక్క బంగారు పతకం ఉంది. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ లో భారత్‌ షూటర్‌ అభినవ్‌ బింద్రా ఆ ఒకే ఒక్క వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించాడు.

-- గరుడ