Begin typing your search above and press return to search.

బండి సంజయ్ తో రేవంత్ రెడ్డి భేటి?

By:  Tupaki Desk   |   4 Feb 2022 5:30 AM GMT
బండి సంజయ్ తో రేవంత్ రెడ్డి భేటి?
X
తెలంగాణ రాజకీయాల్లో ఓ ఆసక్తికర కలయిక చోటుచేసుకుంది. ఇద్దరు బలమైన ప్రత్యర్థుల లాంటి పార్టీ చీఫ్ లు భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరి ఉమ్మడి శత్రువు కేసీఆర్ కాబట్టి.. ఈ ఇద్దరి భేటి ఆశ్చర్యపరిచింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాన ప్రత్యర్థిగా ఓవైపు బీజేపీ చీఫ్ బండి సంజయ్, కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పోరాడుతున్నారు. ఈ ఇద్దరు ఎంపీలు జాతీయ పార్టీలకు తెలంగాణ అధ్యక్షులు కావడం.. పైగా ఇద్దరూ యువకులే కావడంతో సీఎం కుర్చీ కోసం టఫ్ ఫైట్ గా కొట్లాడుతున్నారు.

తెలంగాణ సమస్యలను లేవనెత్తి పోరాడడంలో ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా ఉన్నారు. తమదైన పంథాలో ముందుకెళుతున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్.. రాజ్యాంగాన్ని మార్చాలని చేసిన డిమాండ్ పై ఈ ఇద్దరు నేతలు విరుచుకుపడ్డారు. అయితే అంతలోనే బండి సంజయ్-రేవంత్ రెడ్డి సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. అందులోనూ ఢిల్లీ కేంద్రంగా ఈ సమావేశం అవుతుండడం సంచలనమైంది.

కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆధ్యర్వంలో నేడు జైభీమ్ దీక్షలు చేపట్టారు. మండల కేంద్రాల్లో,జిల్లా, రాష్ట్ర కార్యాలయాల్లో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలన్న డిమాండ్ కు నిరసనగా ఈ దీక్ష చేపట్టామన్నారు.

ఈ నిరసన తర్వాత ప్రధాన ప్రత్యర్థులైన పార్టీల చీఫ్ లు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ సమావేశం కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఎంపీ బండి సంజయ్ దీక్ష చేపట్టారు. ఈ దీక్ష అనంతరం అక్కడే ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. సరదాగా టీ తాగుతూ ముచ్చటించారు.

ఈ సందర్భంగా అక్కడున్న జర్నలిస్టులు ‘ఏం మాట్లాడుకుంటున్నార్ సార్.. అని ప్రశ్నించగా..’ ‘ఇంకేం ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ పరిస్థితుల గురించి అంటూ ’ ఇద్దరూ ఎంపీలు చమత్కరించారు. కొంప దీసి కేసీఆర్ ను ఓడించడానికి ఈ ప్రత్యర్థులు మిత్రులు కారు కదా అని కొందరు సెటైర్లు వేశారు.