Begin typing your search above and press return to search.

రేవంత్ ఫుల్ ఫైర్.. టీఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటిపై వాలితే కాల్చేసుడేనట

By:  Tupaki Desk   |   14 Feb 2022 5:50 AM GMT
రేవంత్ ఫుల్ ఫైర్.. టీఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటిపై వాలితే కాల్చేసుడేనట
X
అవసరం.. అవకాశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత మారిపోతూ ఉంటుంది. ఆయన నోటి నుంచి వచ్చే మాటల తీరు కూడా మారుతుంటుంది. గడిచిన మూడు రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీపైనా.. ఆయన ప్రభుత్వం మీదా ఘాటు విమర్శలు చేస్తూ.. జాతీయ రాజకీయాలపై మాట్లాడుతున్న కేసీఆర్.. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ పై సానుకూల వ్యాఖ్యలు చేయటం.. ఆయనకు అండగా నిలిచేలా ఆయన మాటలు ఉండటం గమనార్హం. ఇలాంటివేళ.. కాంగ్రెస్ స్పందన ఏమిటన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటివేళ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందించారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ కేసీఆర్ తాజా వ్యాఖ్యలపై రియాక్టు అయ్యారు. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ కు దన్నుగా నిలిచేలా వ్యాఖ్యలు చేసే కేసీఆర్ ను.. ఆయన పార్టీ పై తమ అభిప్రాయాన్ని విస్పష్టంగా వెల్లడించిన ఆయన.. కాస్తంత కఠిన పదజాలాన్ని ప్రయోగించారు. టీఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాలితే కాల్చి పారేయటమేనని తేల్చేసిన ఆయన.. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. కేసీఆర్ నీడను కూడా భరించే స్థితిలో కాంగ్రెస్ లేదన్నారు.

ఇప్పటికే టీఆర్ఎస్ ను నమ్మి కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు మోసపోయిందని.. తమ గొంతులో ప్రాణం ఉన్నంతవరకు టీఆర్ఎస్ ను నమ్మేది లేదన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలతోకలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్.. టీఆర్ఎస్ లు ఎన్నటికి కలవవంటూ రేవంత్ స్పష్టం చేశారు. కేంద్రం అవినీతి చిట్టా తన వద్ద ఉందంటున్న కేసీఆర్.. ఆ సమాచారాన్ని ఎందుకు బయటపెట్టటం లేదని ప్రశ్నించిన రేవంత్.. అవినీతి చేయటం ఎంత నేరమో.. దానికి సంబంధించిన సమాచారాన్ని తెలిసి మరీ దాచటం అంతే నేరమన్నారు.

టీఆర్ఎస్.. బీజేపీలు తోడు దొంగలని.. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లుగా ఆ రెండు పార్టీలు అవినీతికి పాల్పడుతూ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి.. బండి సంజయ్ లు స్పందించకపోవటాన్ని రేవంత్ తప్పుపట్టారు. అసోం సీఎం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రంలోని 709 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని.. ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలని టీపీసీసీ నిర్ణయించిందన్నారు.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో తాను ఫిర్యాదు చేస్తానని రేవంత్ పేర్కొన్నారు. గడిచిన రెండు.. మూడు రోజులుగా సీఎం కేసీఆర్ నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో పుట్టుకొస్తున్న సందేహాల్ని తీర్చేసేలా రేవంత్ తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పొచ్చు.