Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నుంచి రేవంత్ సై.. బీజీపీలో సరిజోడెవరు?

By:  Tupaki Desk   |   15 Nov 2021 9:30 AM GMT
కాంగ్రెస్ నుంచి రేవంత్ సై.. బీజీపీలో సరిజోడెవరు?
X
రాజకీయాల పరమార్థం.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో పదవి చేపట్టడమే. ఎమ్మెల్యే అయితే మంత్రి.. మంత్రి అయితే ముఖ్యమంత్రి.. ఏ పార్టీ నాయకుడైనా ఇదే ఆలోచనతో ముందుకుసాగుతుంటారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు వస్తే అధికార టీఆర్ఎస్ కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసురుతున్నారు. సీఎం కేసీఆర్ ను దీటుగా ఢీకొంటున్నారు. రెండు జాతీయ పార్టీలకు యువకులైన నాయకులు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండడంగమనార్హం. రేవంత్ (52), సంజయ్ (50)లను ఎదుర్కొనడం అధికార టీఆర్ఎస్ కు వారిని ఎదుర్కొనడం కత్తిమీద సాము అవుతోంది అని చెప్పడంలో సందేహం లేదు. వాస్తవానికి ఉద్యమం నుంచి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ తీరు మారింది.

అంతకుముందులా వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు తగ్గాయి. అయితే, రేవంత్ రాకతో కాక పెరిగి, దానికి సంజయ్ తోడవడంతో మళ్లీ వ్యక్తిగత దూషణలు మొదలయ్యాయి. ఓ విధంగా చెప్పాలంటే.. ఎన్నికలు రెండేళ్లలో ఉండడమో, నాయకత్వాల మార్పునో, మారిన రాజకీయ పరిణామాలో ఏమో గానీ రాష్ట్ర రాజకీయాలు బాగా వేడెక్కాయి. దాదాపు ఎనిమిదేళ్లుగా అధికారంలో టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజల నుంచి ఆదరణ దక్కకపోవచ్చని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. ఆ క్రమంలో ఓటర్ల మొగ్గు తమవైపు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు నిర్లిప్తమైపోయిన తెలంగాణ కాంగ్రెస్ ను నిద్రలేపి పరుగులు పెట్టిస్తున్నారు ఎనుముల రేవంత్ రెడ్డి. అధ్యక్షుడిగా ఎన్నికవడమే ఆలస్యం.. కార్యక్రమాలు, ఆందోళనలు, నిరసనలకు పిలుపునిస్తూ తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త జోష్ తెస్తున్నారు. పాత తరం నాయకులకు గౌరవం, కొత్త తరం నేతలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అటు సంజయ్ కూడా పాదయాత్ర, ఇతర కార్యక్రమాలతో ప్రజల్లో పట్టు పెంచుకుంటున్నారు.

ఇటు ఆయన.. అటు ఎవరో?

రాష్ట్ర కాంగ్రెస్ లో జానారెడ్డి, జీవన్ రెడ్డి, వీహెచ్, పొన్నాల, గీతారెడ్డి వంటి సీనియర్లు రాజకీయ కెరీర్ చివరకు వచ్చారు. ఇప్పుడంతా రేవంత్ తరహా యువ నాయకత్వమే. పొన్నం, జగ్గారెడ్డి, వంశీచంద్ రెడ్డి వంటివారిదే రాబోయే తరం. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక రేవంత్ కూడా తనదైన టీంను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అందులోనూ ముఖ్యంగా యువతను ప్రోత్సహించాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎన్నో పేర్లు బయటకు వచ్చినా.. యువకుడైన బల్మూరి వెంకట్ ను పోటీలోకి దింపారు.
ఈ ప్రయత్నం విఫలమైందా? సఫలమైందా? అనేది వదిలేస్తే

రేవంత్ ఆలోచనకు మంచి ఎంపిక అంటూ మెజార్టీ తటస్థుల నుంచి మొగ్గు కనిపించింది. ఏదేమైనా.. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం కనిపిస్తున్న ఏకైక స్టార్ రేవంత్ రెడ్డి అనడంలో సందేహం లేదు. పార్టీ శ్రేణులను ముందుకు నడిపించడంలో గానీ, ఎప్పటికప్పడు ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వడంలో గాని రేవంత్ ను మించిన వారు లేరు. దీనికి ఉదాహరణ.. వరి ధాన్యం కొనాలంటూ అధికార టీఆర్ఎస్ హైదరాబాద్ ధర్నా చౌక్ లో ధర్నా చేస్తే.. మిగతా పార్టీలకు దానికి కౌంటర్ గా ఏం మాట్లాడాలో తెలియలేదు. రేవంత్ మాత్రం.. టీఆర్ఎస్ ధర్నా చేయాల్సింది ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అంటూ కామెంట్ చేసి అందరినీ ఆలోచింపజేశారు. అంటే, ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందితే సీఎం అభ్యర్థి రేవంత్ అనడంలో సందేహం లేదు.

మరి కమలం సంగతేంటో??

రేవంత్ కు దీటుగా రాష్ట్ర బీజేపీలో యువ నాయకత్వం ఉంది. సంజయ్, అర్వింద్, రాజాసింగ్, రఘునందన్.. వీరికి ఇప్పడు ఈటల తోడు. రేవంత్ కు అటు ఇటుగా సమ వయస్కులే. అంటే.. వచ్చే పది, పదిహేనేళ్లు తెలంగాణ రాజకీయాలు వీరిచుట్టూనే తిరగడం ఖాయం.

మహిళల్లో విజయశాంతి, డీకే అరుణ ఉన్నారు. వీరిద్దరూ చట్ట సభల సభ్యులుగా వ్యవహరించిన వారే కావడం విశేషం. కొంచెం సీనియర్ అయిన కిషన్ రెడ్డిదీ కీలక పాత్రే కానుంది. అయితే, బీజేపీ ప్రబలంగా దూసుకొచ్చి రాష్ట్రంలో అధికారానికి చేరువైతే సీఎం అభ్యర్థి ఎవరనేది మాత్రం కచ్చితంగా చెప్పలేం. సైద్ధాంతిక పార్టీ అయిన బీజేపీలో ముందునుంచి ఉన్నవారికీ, అదీ ఆర్ఎస్ఎస్ ఆశీర్వాదం ఉన్నవారికే పార్టీలో, ప్రభుత్వంలో పదవులు దక్కుతాయని కచ్చితంగా చెప్పగలం. ఆ లెక్కన చూస్తే ఎక్కువ మొగ్గు బండి సంజయ్, రాజాసింగ్ కే ఉంటుంది. అంతమాత్రాన మిగతావారి కష్టాన్ని, ప్రాధాన్యాన్ని తక్కువ చేసినట్టు కాదు. ఎవరికి ఎక్కువ అవకాశం అన్నది ఇక్కడ చెప్పకోవాల్సిన అంశం. ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను ప్రస్తుతం నిశితంగా విమర్శిస్తూ సాగుతున్న సంజయ్.. అదే స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.

అయితే, పార్టీలో ఒకటి కంటే ఎక్కువ ముఖాలు కనిపిస్తుండడం బీజేపీకి ప్లస్సూ..మైనస్సు. రేవంత్ కు దీటుగా నాయకుడిగా నిలిచే ఒకరిని ఫోకస్ చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది. రాబోయే రోజుల్లో అధికార టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరిగి మరింత దూకుడుగా వెళ్లాల్సి వస్తే కాంగ్రెస్ కు రేవంత్ రూపంలో ఇప్పటికే తురుపుముక్క ఉన్నారు. మరి బీజేపీ తరఫున ఆ ఆయుధం ఎవరో ఆ పార్టీనే సిద్ధం చేసుకోవాలి.