Begin typing your search above and press return to search.

కేసీఆర్ తో రివ్యూ అంటే..రెండు సినిమాలు

By:  Tupaki Desk   |   15 Oct 2015 8:03 AM GMT
కేసీఆర్ తో రివ్యూ అంటే..రెండు సినిమాలు
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా సమీక్షా సమావేశం నిర్వహించారంటే సుదీర్ఘ సమయం తీసుకుంటున్నారు. ఇది అధికారులకు మా గొప్ప ఇబ్బందిగా మారింది. చూస్తూ.. చూస్తూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతుంటే సమయం గురించి ప్రస్తావన తీసుకురాకూడని పరిస్థితి. మరోపక్క గంటల కొద్దీగా సా..గిపోతుండే వాక్ ప్రవాహానికి అడ్డుపడేంత ధైర్యం ఎవరికి ఉండదు. దీంతో.. అధికారులు కిందామీదా పడిపోతున్నారు.

ఏదైనా శాఖల మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారంటే కనీసం కనిష్ఠంగా ఆరు గంటలు.. గరిష్ఠంగా తొమ్మిది గంటల వరకూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సరికొత్త అనుభవానికి అధికారులు కిందామీదా పడుతున్న పరిస్థితి.

నిజానికి.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో అయితే అధికారులు తెగ ఇబ్బంది పడిపోయేవారు. ముఖ్యమంత్రితో రివ్యూ అంటే.. గంటో.. రెండు గంటలో.. కష్టమనుకుంటే మూడు గంటలకు మించి ఉండేది కాదు. దీనికి భిన్నంగా ఆరు నుంచి తొమ్మిది గంటల వరకూ అంటే వారికి దిమ్మ తిరిగిపోయేది. కాలు.. చేయి కదపకుండా బిగుసుకొని పోయేలా అన్నేసి గంటలు కూర్చోవటం కష్టంగా ఉండేది. గడిచిన 18 నెలల కాలంలో అధికారులు కేసీఆర్ తీరుకు అలవాటు పడ్డారు.

సుదీర్ఘ కాలంపాటు సాగే సమీక్షా సమావేశాల్ని అధికారులు ముద్దుగా సినిమాలతో పోలుస్తుంటారు. కేసీఆర్ తో రెండు సినిమాలు చూసొచ్చామంటూ సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. మరికొందరు అధికారులైతే.. భారీ సినిమాలు రెండు ఇప్పుడే పూర్తి అయ్యయని చెబుతుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టైం పరంగా అన్నేసి గంటలు గడిచి కాస్త ఇబ్బందిగా ఉంటుందే కానీ.. కేసీఆర్ మాట్లాడుతుంటే మాత్రం బోర్ కొట్టదని చెబుతుంటారు. ఏ విషయం కదిపినా అద్భుతమైన అవగాహన.. సమాచారంతో పాటు.. తెలిసిన విషయాన్ని అందంగా చెప్పే తీరు కదలకుండా చేస్తుందని చెబుతారు. కేసీఆర్ తో సమీక్షా సమావేశం అంటే.. అధికారులకు కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అంటూ వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.