Begin typing your search above and press return to search.

ఆ కసాయికి పెట్టిన ఖర్చు చెప్పరంట

By:  Tupaki Desk   |   2 Oct 2015 10:08 AM GMT
ఆ కసాయికి పెట్టిన ఖర్చు చెప్పరంట
X
ఆ సమాచారం ఇస్తే.. దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదు. ఎలాంటి ప్రమాదం కూడా లేదు. కానీ.. సమాచారం ఇచ్చేందుకు మాత్రం ససేమిరా అనటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 1993 ముంబయి బాంబు పేలుళ్లకు సంబంధించి.. ఆ పేలుళ్లతో సంబంధం ఉందని తేల్చిన యాకూబ్ మెమన్ ను ఈ మధ్యన ఉరి తీసిన సంగతి తెలిసిందే.

అప్పుడెప్పుడో 1993లో జరిగిన ఘటనకు.. దోషికి శిక్ష అమలు అయ్యింది 2015లో. ఇదిలా ఉంటే.. యాకూబ్ మెమన్ కోసం భారత ప్రభుత్వం పెట్టిన ఖర్చ ఎంతన్న సందేహం ఒకరికి వచ్చింది. వెంటనే.. సమాచార హక్కు చట్టం ద్వారా.. ఆ వివరాలు తెలియజేయాలని కోరారు. అయితే.. మహారాష్ట్ర హోం శాఖ అధికారులు మాత్రం ఈ దరఖాస్తును జాతి భద్రత కారణాలతో తిరస్కరిస్తున్నట్లు చెప్పటం విశేషం. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని దోషిగా తేలిన వ్యక్తికి సంబంధించి జాతి జనుల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని ఖర్చు చేసి.. ఆ వివరాలు అడిగితే కాదనటంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

మరోవైపు.. ముంబయి ఉగ్రవాదుల దాడిలో పట్టుబడిన కసబ్ మీద పెట్టిన ఖర్చు వివరాల్ని అడిగినప్పుడు గత ప్రభుత్వం ఆ వివరాల్ని అందించటం తెలిసిందే. నాడు లేని ఇబ్బంది ఇప్పుడే మహారాష్ట్ర హోం శాఖకు రావటం గమనార్హం. భారత్ మీద యుద్ధం చేసేందుకు ఉగ్రవాది రూపంలో వచ్చి అరాచకం సృష్టించిన కసబ్ మీద భారత సర్కారు మొత్తం రూ.28.5కోట్లు ఖర్చు చేసింది. అతడికి భద్రతతో పాటు.. రవాణా.. భోజనం.. బట్టలు.. మందులు.. ఇలాంటివి మొత్తంలో ఖర్చులో కలిసి ఉన్నాయి.

కసబ్ విషయంలో లేని అభ్యంతరం.. యాకూబ్ మెమన్ విషయంలో ఎందుకన్నది ఒక ప్రశ్నగా మారింది. ఉగ్రవాదులకు సంబంధించి దేశ ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల నుంచి ఖర్చు పెట్టే సొమ్ముకు లెక్క అడగటం జాతి భద్రతకు ఇబ్బంది అవుతుందా..?