Begin typing your search above and press return to search.

కేసీఆర్.. కేటీఆర్ లను ఉతికి ఆరేసిన రేవంత్

By:  Tupaki Desk   |   9 May 2022 3:06 AM GMT
కేసీఆర్.. కేటీఆర్ లను ఉతికి ఆరేసిన రేవంత్
X
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీపై గులాబీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభ అనూహ్యంగా విజయం సాధించటం.. ఆ సందర్భంగా ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. తామేం చేస్తామన్న దానిపై విస్పష్ట ప్రకటన చేసిన పార్టీ.. దానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.

తెలంగాణ ఇస్తామన్న మాట ఇచ్చి.. నిలబెట్టుకున్న పార్టీగా తమను తాము అభివర్ణించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదిలా ఉంటే.. ఒక్క సభతో యాక్టివ్ అయిన కాంగ్రెస్ పై కస్సు మంటున్నారు గులాబీ నేతలు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అయితే కాంగ్రెస్ ను.. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే. దీనికి అంతే తీవ్రమైన పదజాలంతో కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

కేసీఆర్ కు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని మంత్రి కేటీఆర్ విమర్శిస్తారా? అంటూ రివర్సు గేర్ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం పరాజయంతో మొదలైందని.. ప్రజాగ్రహ భయంతో ఆయన వేర్వేరు జిల్లాల్లో నాడు ఎంపీగా పోటీ చేశారన్నారు. సిద్ధిపేట నుంచి కరీంనగర్.. అక్కడి నుంచి పాలమూరుకు పారిపోయిన వైనాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో కేసీఆర్ ఉన్నప్పుడు సింగిల్ విండో డైరెక్టర్ గా ఓడినప్పటికీ.. ఛైర్మన్ గా కాంగ్రెస్ పార్టీనే ఆయనకు ఛాన్సు ఇచ్చిందన్నారు.

రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు ఉందా? ఏ హోదాలో రాష్ట్రానికి వచ్చారని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారన్న రేవంత్.. "కేటీఆర్ ఏ హోదాతో రాహుల్ ను విమర్శిస్తున్నారు? శరద్ పవార్.. స్టాలిన్.. మమతా బెనరజీ వద్దకు కేసీఆర్ వెళ్లి రావొచ్చా? తెలంగాణ రైతులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.. ఎంపీ హోదాలో ఆయన వచ్చారు. అలాంటి రాహుల్ నే ప్రశ్నిస్తారా? ఇతర రాష్ట్రాల్లో గెలిచి తెలంగాణకు వచ్చిన వారు పొలిటికల్ టూరిస్టులు అయితే.. వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్న కేసీఆర్ ను దేశ దిమ్మరి అనాలా? మీరు వెళ్లి కలిస్తే చతురత.. ఇతరులు వస్తే మాత్రం టూరిస్టా?" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు.

పొగపెట్టగానే కలుగులో ఉన్న ఎలుకలన్నీ బయటకు వచ్చేశాయని.. పంది కొక్కు ఒక్కటే బయటకు రావాల్సి ఉందన్నారు. అది కూడా రేపో మాపో బయటకు వస్తుందని భావిస్తున్నట్లుగా రేవంత్ వ్యాఖ్యానించారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించేనన్న విషయం తెలిసిందే. రాహుల్ ను టూరిస్టుగా పేర్కొంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు రంగంలోకి దిగిన రేవంత్.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంతనే యాదగిరి గుట్టు.. అమరవీరుల స్థూపం అవినీతిపై విచారణ జరిపిస్తామని చెప్పి మరో సంచలనానికి తెర తీశారు.

మాట ఇవ్వకున్నా దళితుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్న విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. లోక్ సభలో రాజ్యసభాపక్ష నేతగా ఖర్గేకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్నారు. ప్రధానమంత్రిగా పదవిని చేపట్టే అవకాశం ఉన్నా సోనియా.. రాహుల్ గాంధీలు ఆ పదవిని చేపట్టలేదన్న విషయన్ని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర ఇంఛార్జి తరుణ్ చుగ్ భాషను కేటీఆర్ అనుసరిస్తున్నారని.. వీరిద్దరి మాటల్నే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెబుతున్నారన్నారు. ఈ ముగ్గురిదీ ఒకే రకమైన భావజాలమని వ్యాఖ్యానించారు.