Begin typing your search above and press return to search.

టీపీసీపీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం .. ఆదిలోనే అది పెద్ద సవాల్ !

By:  Tupaki Desk   |   7 July 2021 9:50 AM GMT
టీపీసీపీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం .. ఆదిలోనే అది పెద్ద సవాల్ !
X
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి భాద్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో నేతలు, రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చారు. ముందుగా అనుకున్న ముహూర్తానికి అనుగుణంగా నేటి మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన టీపీసీసీ పగ్గాలను అందుకున్నారు.అసంతృప్తులు అనుకున్న నేతలూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి తదితర సీనియర్ నేతలు రేవంత్ బాధ్యతల స్వీకారానికి హాజరయ్యారు. ఇప్పటికే గాంధీభవన్ లో రేవంత్ కు అనుగుణంగా వాస్తు మార్పులను చేశారు.

సీఎల్పీ నేత భట్టి చాంబర్, ఇంతకుముందు పీసీసీ చీఫ్ చాంబర్ కు పక్కనే ఉన్న మీటింగ్ హాల్ ను కలిపి రేవంత్ చాంబర్ గా మార్చారు. ఇంతకు ముందు ఉత్తమ్ మూసేయించిన గేట్ నూ తెరిచి రెండు గేట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహాల ఇన్చార్జ్ మాణికం ఠాగూర్, ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, గోవా పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోడేకర్, అండమాన్ పీసీసీ అధ్యక్షుడు కులదీప్ శర్మ, ఎర్నాకులం ఎంపీ ఐబీ హెడెన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ తారీక్ అన్వర్, ప్రచార కమిటి చైర్మన్ మధుయాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, కాగా కుమార్తె జయారెడ్డితో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రేవంత్‌ ను అభినందించారు. అంతకుముందు రేవంత్‌ రెడ్డి బుధవారం ఉదయం తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడికి చేరుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. తర్వాత అక్కడి నుంచి రేవంత్ ర్యాలీగా గాంధీభవన్‌కు చేరుకున్నారు.

రేవంత్‌ రెడ్డి కు పీసీసీ ఇవ్వడంపై ఆగ్రహం గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. పీసీసీగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌ కు త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో మొదటి అతి పెద్ద సవాల్ ఎదురుకానుంది. టీఆర్‌ ఎస్‌ కు ప్రత్యామ్నాయ రేసులో ముందున్న బీజేపీని తట్టుకొని కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చి గెలవగలిగితే రేవంత్ సత్తా చాటినట్టే. అయితే , అధికార టి ఆర్ ఎస్ , ఈటల కి సొంత నియోజకవర్గం కావడంతో టి ఆర్ ఎస్ , బీజేపీని అక్కడ దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదు. కానీ, అది చేసి చూపిస్తే రేవంత్ కి ఇక పార్టీ లో తిరుగుండదు అని చెప్పవచ్చు. అయితే , ఇక.. షర్మిల పార్టీ వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకులో చీలిక రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రేవంత్‌ ముందున్న మరో సవాల్. పార్టీలో అందరినీ కలుపుకునిపోవడం కూడా రేవంత్ రెడ్డికి కత్తిమీద సాము లాంటిదే. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌ గా బాధ్యతలు స్వీకరించే లోపే వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలను నివాసాలకు వెళ్లి మరీ కలవడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం రేవంత్‌కు కొంత ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. టీపీసీసీ చీఫ్ రేసులో చివరి దాకా పేరు వినిపించిన శ్రీధర్‌ బాబును కూడా రేవంత్ కలవడం రాజకీయంగా రేవంత్ రెడ్డి వేసిన వ్యూహాత్మక అడుగనే చెప్పాలి.