Begin typing your search above and press return to search.

కేసీఆర్ కంగారుపడే పాయింట్ బయటకు తీసిన రేవంత్

By:  Tupaki Desk   |   25 Aug 2022 5:31 AM GMT
కేసీఆర్ కంగారుపడే పాయింట్ బయటకు తీసిన రేవంత్
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ లేని సరికొత్త రాజకీయం తెలంగాణలో కనిపిస్తోంది. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతూ వాతావరణాన్ని వేడెక్కించేలా పరిస్థితులు మారాయి. కేంద్రంలోని మోడీ సర్కారుతో సై అంటే సై అనేస్తున్న గులాబీ బాస్ టార్గెట్ అయ్యారని.. అందులో భాగంగా పరిణామాలు ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

వారం క్రితం ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కవిత కీ రోల్ ప్లే చేసినట్లుగా ఢిల్లీ బీజేపీ నేతలు ఆరోపించటం తెలిసిందే. ఈ హడావుడి ఒక పక్క సాగుతున్న వేళ.. మరోవైపు ఐటీ దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వేళ.. టీపీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్నరేవంత్ రెడ్డి లైన్లోకి వచ్చారు. ఢిల్లీలో లిక్కర్ స్కాం చోటు చేసుకుందని.. అందులో కవిత ఉందని ఆరోపించిన బీజేపీ.. వారిపై చట్టరీత్యా చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ పార్టీకి ఆర్థిక సాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. వారి ఇండ్లలో సోదాలు చేయాల్సిన బాధ్యత కేంద్ర నిఘా సంస్థలకు ఉందన్న ఆయన.. ఆ పని ఎందుకు చేయటం లేదు? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రేవంత్ నోటి నుంచి ఆసక్తికర వాదన ఒకటి వినిపించింది. 'గతంలో తెలంగాణ ఆఫ్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న సోమనాథ్ భారతి మాట్లాడుతూ.. అవినీతిపరుడైన తెలంగాణ రాష్ట్ర సీఎంను తాము కలవమని పేర్కొన్నారు. దీంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే నేతల్ని కేజ్రీవాల్ కలవరని అనుకున్నా. కానీ.. ఇంతలో ఏమైందో కానీ కేసీఆర్ వెళ్లి కేజ్రీవాల్ ను కలిశారు. అంతేకాదు ఆయనతో కలిసి కేసీఆర్ పంజాబ్ కు వెళ్లారు' అంటూ నాడు జరిగిన విషయాల్ని గుర్తు చేశారు.

ఇదంతా ఎందుకంటే.. అక్కడే ఉంది ట్విస్టు అంటున్నరేవంత్.. ''పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆర్థిక సాయం చేసినట్లే.. వేర్వేరు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలకు వందలాది కోట్ల రూపాయిలు కేసీఆర్ ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలి. నిజం నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఉంది' అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు గులాబీ బాస్ లో కొత్త కంగారుకు కారణమయ్యేలా మారిందని చెబుతున్నారు.

తెలంగాణలో ఉప ఎన్నికలు రాగానే వివిధ కంపెనీల మీద ఐటీ దాడులు జరుగుతున్నాయని.. ఇప్పటివరకు 30 వరకు సంస్థల్లో సోదాలు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు రేవంత్. ఇన్ని సంస్థల్లో సోదాలు చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలోనూ.. వారి కుటుంబ సభ్యుల ఇండ్లలోనూ.. ఆఫీసుల్లోనూ సోదాలు ఎందుకు నిర్వహించరు?' అని సూటి ప్రశ్నను సంధించారు. కేసీఆర్ కుమార్తె కవితతో పాటు ఆయన కుమారుడు కేటీఆర్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసీఆర్ కుటుంబంపై విచారణ చేపట్టాలన్నారు.

కేసీఆర్ కుటుంబ సభ్యుల ఇళ్లు.. ఆఫీసుల్లో సోదాలు ఆలస్యమైతే.. ఆధారాలు మాయం చేసే ప్రమాదం ఉంది కదా? అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కుటుంబంపై సోదాలు చేయకపోవటానికి టీఆర్ఎస్ పార్టీలో కేంద్రంలోని మోడీ సర్కారుకు ఉన్న లాలూచీ ఏమిటంటూ ప్రశ్నించిన వైనం ఇప్పుడు కీలకంగా మారింది. మొత్తానికి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసినట్లుగా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశారని చెప్పక తప్పదు.