Begin typing your search above and press return to search.

అధ్యక్ష హోదాలో రోటీన్ మాటలతో బోర్ కొట్టించాడే

By:  Tupaki Desk   |   27 Jun 2021 8:30 AM GMT
అధ్యక్ష హోదాలో రోటీన్ మాటలతో బోర్ కొట్టించాడే
X
ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. శనివారం రాత్రి వెల్లడైన ఈ ప్రకటన అనంతరం కొన్ని మీడియా సంస్థలతో ప్రత్యేకంగా మాట్లాడారు రేవంత్. ఈ సందర్భంగా ఆయన నుంచి ఆసక్తికర వ్యాఖ్యల్ని చాలామంది ఆశించారు. సొంత పార్టీ నేతల మీద కాకున్నా.. తెలంగాణ అధికారపక్షం మీదా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మీదా ఆయన మండిపడే అవకాశం ఉందని భావించారు. అయినప్పటికి అలాంటిదేమీ లేకుండా చాలా సింఫుల్ గా మాట్లాడారు.

రేవంత్ వ్యాఖ్యాల్ని పరిశీలిస్తే.. ఇప్పటికిప్పుడు సంచలనాల దిశగా అడుగులు వేయొద్దన్న యోచనలో ఉన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. సాధారణంగా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వారి నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయో.. దాదాపుగా అలాంటి వ్యాఖ్యలే ఆయన నోటి నుంచి రావటం గమనార్హం. అందర్నీకలుపుకుపోతానని.. కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తానని.. సోనియా.. రాహుల్ ఆలోచన మేరకు పని చేస్తానని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ కుటుంబం లాంటిదని.. ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయని.. వాటిని భేదాభిప్రాయాలుగా చూడకూడదన్నారు. కోమటిరెడ్డి సోదరులు తన కుటుంబమని చెప్పిన రేవంత్.. ఉత్తమ్.. భట్టి.. జానా తదితరులతో మాట్లాడుతూ కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పారు. పార్టీలో కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని.. కాంగ్రెస్ అంటే కార్యకర్తల పార్టీ అని నిరూపిస్తానని వ్యాఖ్యానించారు. రేవంత్ వ్యాఖ్యల్ని చూస్తే సాదాసీదాగా ఉండటమే కాదు.. పగ్గాలు చేతికి వచ్చినప్పుడు మాట్లాడే రొడ్డు కొట్టుడు మాటలే ఆయన నోటి నుంచి వచ్చాయని చెప్పక తప్పదు.