Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తోడుగా న్యూస్ చానెల్.. రేవంత్ రెడ్డి యోచన

By:  Tupaki Desk   |   2 Jan 2022 9:24 AM IST
కాంగ్రెస్ తోడుగా న్యూస్ చానెల్.. రేవంత్ రెడ్డి యోచన
X
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు మద్దతుగా బలమైన మీడియా ఉంది. సొంతంగా టీఆర్ఎస్ కు పత్రిక, న్యూస్ చానెల్ తోపాటు తెలుగులోనే నంబర్ 1 న్యూస్ చానెల్ మద్దతు కూడా ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ వ్యతిరేకతను తొక్కిపెట్టేస్తూ ప్రతిపక్షాలను నీరుగార్చుతోందన్న విమర్శలు కాంగ్రెస్ నుంచి ఉన్నాయి.

ఇక ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి బలమైన మీడియా ఉంది. బీజేపీకి ఇటీవల మీడియా న్యూస్ చానెల్స్ మద్దతు పెరిగింది. ఒక తెలంగాణ న్యూస్ చానెల్ ఓనర్ బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి వాయిస్ ఏర్పడింది.

ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారమే పరమావధిగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తమకూ సొంతంగా న్యూస్ చానెల్ ఉండాలని భావిస్తోంది. రాజకీయాల్లో రాణించాలంటే మీడియా కీలకం. ఈ విషయాన్ని పసిగట్టిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సొంతంగా ఒక న్యూస్ చానెల్ ను నెలకొల్పాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.ఈ మేరకు రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారన్నా ప్రచారం సాగుతోంది.

ముందుగా యూట్యూబ్ చానెల్ ను మొదలుపెట్టి దాన్ని 24 గంటలూ కార్యక్రమాలు ప్రసారం అయ్యే చానెల్ గా మార్చాలన్న ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మీడియాలోని పెద్ద తలకాయలతో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో అధికారం సాధించాలంటే మీడియా అవసరం ఎంతైనా ఉంది. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి 2023లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకం. అందుకే సొంతంగా మీడియాను ఏర్పాటు చేసుకోవాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు సమాచారం.

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మీడియాపై నిషేధం విధించి అన్నింటిని దారికి తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకు మీడియా అసలు కవరేట్ ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే తనే సొంతంగా ఒక చానెల్ పెడితే కేసీఆర్ తీరును ఎండగట్టి కాంగ్రెస్ ను నిలబెట్టవచ్చని యోచిస్తున్నట్టు సమాచారం.