Begin typing your search above and press return to search.

పోస్టు ఇస్తే ఫైర్ బ్రాండ్ పాదయాత్ర చేస్తాడట

By:  Tupaki Desk   |   14 Dec 2020 9:03 AM IST
పోస్టు ఇస్తే ఫైర్ బ్రాండ్ పాదయాత్ర చేస్తాడట
X
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి ఉన్న టాలెంట్ అంతా ఇంతా కాదు. మాటకు మాట.. ఎత్తుకు పైఎత్తుతో పాటు.. నాయకత్వ లక్షణాలు మాత్రమే కాదు.. మరో ప్రత్యేక గుణం కూడా ఆయన సొంతమంటారు. ఇటీవల ముగిసిన గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలంతా ఎవరికి వారు గప్ చుప్ అన్నట్లుగా ఉండిపోతే.. రేవంత్ మాత్రం అందుకు భిన్నంగా కొంతమంది అభ్యర్థులకు తన వంతు సాయంగా భారీ మొత్తాల్ని సర్దుబాటు చేశాడట.

అలా చేసిన వారిలో ఇద్దరు గెలవటం.. ఆయన పుణ్యమేనని చెబుతారు. ఈ కోణంలో చూసినప్పుడు కాంగ్రెస్ నేతల్లో ఎవరు మాత్రం జేబులో నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టేట్లుగా కనిపించరు. ఈ విషయాన్ని ఇలా ఉంచితే.. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవిని ఎవరికి కట్టబెట్టాలన్న అంశంపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. ఈ పదవి కోసం చాలామంది పోటీ పడినా.. అంతిమంగా మాత్రం ముగ్గురు నేతలు షార్ట్ లిస్టు చేసినట్లుగాచెబుతున్నారు.

వారిలో మొదటిపేరు రేవంత్ రెడ్డి అయితే.. రెండోది కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మూడోది డి. శ్రీధర్ బాబుది. ఈ ముగ్గురు నేతల్లో ఎవరికి వారిగా చూస్తే.. ఎవరికి ఉండాల్సిన ఫ్లస్సులు ఉన్నట్లే.. మైనస్సులు ఉన్నాయి. దీంతో.. ఎవరికి పీసీసీ రథసారధి పదవిని కట్టబెడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటివేళ.. రేవంత్ నోటి నుంచి ఆసక్తికర మాట ఒకటి వచ్చింది.

తనతో పోటీ పడుతున్న వారికి సవాల్ విసురుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. తనకు కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని అప్పజెబితే.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని చెప్పారు. తెలంగాణలోని ప్రతి ఇంటికి వెళ్లి కలుస్తానని.. తెలంగాణ సమాజానికి చాలా సేవ చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన చెప్పారు. రేవంత్ మాట విన్న తర్వాత అయినా రేసులో ఉన్న వారి రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.