Begin typing your search above and press return to search.

తెలంగాణకు రేవంత్ రెడ్డేనా?

By:  Tupaki Desk   |   21 Sept 2015 11:00 PM IST
తెలంగాణకు రేవంత్ రెడ్డేనా?
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని ఎంపిక చేయనున్నారా? ఈ మేరకు నిర్ణయం జరిగిపోయిందా? ఆంధ్రప్రదేశ్ లో కిమిడి కళా వెంకట్రావు ఎంపిక ఇందుకు నిదర్శనమా? ఈ ప్రశ్నలకు ఔను అనే అంటున్నాయి టీడీపీ వర్గాలు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా రేవంత్ - రమణ మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు నాయుడు పార్టీని ముందుకు నడిపించే వాళ్లకు పదవి ఇస్తారా లేక తన గుప్పిట్లో ఉండే వ్యక్తికి పదవి ఇస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. ఐవీఆర్ఎస్ ద్వారా ఎంపిక చేయనున్నామని చెప్పినా.. అంతిమంగా చంద్రబాబు నిర్ణయమేననేది టీడీపీ వర్గాలకు కూడా తెలుసు. దీంతో ఈ విషయంలో సందిగ్ధం ఏర్పడింది.

నవ్యాంధ్రలో బీసీ వర్గానికి చెందిన కళా వెంకట్రావుకు అధ్యక్ష పదవి ఇచ్చారు కనక తెలంగాణలో ఇక రమణకు అవకాశం లేనట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడానికే ఏపీలో బీసీకి పదవి ఇచ్చారని, రెండు రాష్ట్రాల్లోనూ బీసీలకే పదవి ఇస్తే మిగిలిన వర్గాల్లో అసంతృప్తి నెలకొనే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో బీసీకి పెద్దపీట వేశారు కనక తెలంగాణలో ప్రాబల్య వర్గమైన రెడ్డి సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రేవంత్ ఎంపిక ఖరారు అయినట్లేనని విశ్లేషకులు వివరిస్తున్నారు. సామాజిక సమీకరణాలను కచ్చితంగా పాటించే చంద్రబాబు వ్యవహార శైలిని గమనిస్తే తెలంగాణకు రేవంత్ రెడ్డి ఖాయమని వివరిస్తున్నారు.