Begin typing your search above and press return to search.

తలసాని అంతలా దిగజారాడన్న ఫైర్ బ్రాండ్!

By:  Tupaki Desk   |   8 Nov 2020 7:00 AM IST
తలసాని అంతలా దిగజారాడన్న ఫైర్ బ్రాండ్!
X
అసలే ఫైర్ బ్రాండ్. ఆ పైన కోపమొచ్చింది. ఇంకేముంది? మాటలు తూటాల్లా పేలాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్రేటర్ పరిధిలో వరద బాధితులకు సాయం అందించే విషయంలో అక్రమాలు జరిగినా పట్టించుకోకుండా ఉన్న తీరును ఆయన మాటలతో కడిగి పారేశారు. మంత్రి కేటీఆర్ ను అభినవ అంబేడ్కర్ అంటూ మంత్రి తలసాని పోల్చటం సిగ్గుచేటన్న రేవంత్.. ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయటం గమనార్హం.

వరద సాయంపై జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపాలని.. అవినీతికి పాల్పడిన అధికారులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేసిన ఆయన తలసానిపై కొత్త తరహాలో విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో మంత్రి తలసాని మీద ఈ స్థాయిలో విమర్శలు చేసింది రేవంతే అవుతారు. ‘‘తలసానికి సిగ్గు లేదు. అంబేడ్కర్.. జ్యోతిరావు పూలేలతో కేటీార్ ను పోలుస్తారా? తలసాని ఎంత దిగజారాడంటే.. తన మనమడికి కేటీఆర్ పేరు పెట్టుకున్నారు. ఎవరైనా రోడ్ల మీద జులాయిగా.. జూబ్లీహిల్స్ గెస్ట్ హౌజ్ లలో తిరిగే వారి పేరు పెట్టుకుంటారా’’ అని మండిపడ్డారు.

వరద బాధితుల్ని ఆదుకోవటం కోసం ముఖ్యమంత్రి రూ.554 కోట్లు నిధులను విడుదల చేస్తే.. పేదలపై కేసీఆర్ కు ఎందుకో ప్రేమ కలిగిందని.. కరుడు కట్టిన రాక్షసుడికైనా మార్పు వచ్చిందని తాను అనుకున్నట్లుగా చెప్పారు. అయితే.. పరిహారం పేరుతో నిజమైన బాధితులకు కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలకు.. తమకు నచ్చిన వారికి సాయం చేయటం.. అందులో కమీషన్లు తీసుకున్నారన్నారు. అక్రమాలపై తాను లిఖిత పూర్వకంగా కంప్లైంట్ చేసినప్పటికీ.. జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ఇటీవల కాలంలో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఈ తరహాలో విరుచుకుపడటం ఇదేనని చెబుతున్నారు.