Begin typing your search above and press return to search.

సమ్మెపై రేవంత్ ఫైరింగ్..మామా అల్లుళ్లను ఏకిపారేశారు!

By:  Tupaki Desk   |   13 Oct 2019 2:53 PM GMT
సమ్మెపై రేవంత్ ఫైరింగ్..మామా అల్లుళ్లను ఏకిపారేశారు!
X
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె రోజురోజుకీ ఉదృతమవుతోంది. సమ్మెను చాలా ఈజీగానే లెక్కేసిన కేసీఆర్ సర్కారు క్రమంగా ఒంటరి అయిపోతూ ఉంటే... సమ్మె చేపట్టిన ఆర్టీసీ కార్మికులకు దాదాపుగా అన్ని వర్గాలూ చేదోడువాదోడుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తనదైన శైలిలో విమర్శించే టీ కాంగ్రెస్ యువ నేత - మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి... ఆర్టీసీ సమ్మెను అస్త్రంగా చేసుకుని మరోమారు కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ తో పాటు గడచిన ఎన్నికల్లో తన ఓటమికి ప్రధాన కారకుడిగా భావిస్తున్న కేసీఆర్ మేనల్లుడు - మంత్రి హరీశ్ రావు పైనా రేవంత్ ఓ రేంజిలో ఫైరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ సంధించిన పంచ్ డైలాగులు బాగానే పేలాయని చెప్పాలి.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా పీఆర్టీయూ తెలంగాణ శాఖ ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి... ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేవలం రెండు రోజులు విదులకు హాజరు కాని ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేసిన కేసీఆర్... ఏకంగా ఆరేళ్ల పాటు సచివాలయానికి రాలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. రెండ్రోజులకే డిస్మిస్ అంటే... మరి ఆరేళ్ల పాటు సచివాలయం ముఖం చూడని కేసీఆర్ పై పీడీ కేసులు పెట్టాల్సిందే కదా అంటూ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చేందుకు ముఖం చెల్లని కేసీఆర్ పత్రికా ప్రకటనలు ఇస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ఖమ్మంలో ఆత్మ బలిదానానికి పాల్పడ్డ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి స్థితిగతులను కూడా ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.,.. శ్రీనివాసరెడ్డి ఆర్థికంగా బలహీనుడేమీ కాదని, కేవలం ఉద్యోగ భద్రతకు సంబంధించిన ఆందోళన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. అయినా సమ్మె చట్టబద్దంగానే జరుగుతున్న నేపథ్యంలో సమ్మెపై ఉక్కుపాదం మోపడం కేసీఆర్ లాంటి నియంతలకే సాధ్యమైందని కూడా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె చట్టబద్దంగా జరుగుతుంటే.... ఆట మధ్యలో గేమ్ రూల్ మారుస్తామంటూ కుదరదని కూడా రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగానే హరీశ్ రావును టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి... గతంలో ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీశ్ రావు... ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఎక్కడున్నారని, అసలు నోరెందుకు విప్పడం లేదని నిలదీశారు.

ఆర్టీసీ సమ్మెపై ఉక్కుపాదం మోపుతున్న కేసీఆర్ సర్కారు వ్యూహాన్ని తనదైన శైలిలో విశ్లేషించిన రేవంత్ రెడ్డి... ఇప్పుడు ఆర్టీసీ సమ్మెను విఫలం చేస్తే... భవిష్యత్తులో ఉపాధ్యాయులను కూడా పాలేరుల్లా చూసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణను వ్యతిరేకించిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టిన కేసీఆర్... తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన చుక్కా రామయ్య, కోదండరాం వంటి వారిని అణచివేసేందుకు యత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఇదే తరహా వైఖరితో ముందుకు సాగితే... పెన్నులే గన్నులై పేలతాయని కూడా రేవంత్ అదిరేటి డైలాగ్ సంధించారు. పెన్నులపై మన్నున గప్పితే గన్నులై పేలతాయంటూ రేవంత్ తనదైన శైలి వ్యాఖ్య చేశారు. మొత్తంగా ఆర్టీసీ సమ్మెను అస్త్రంగా మలచుకున్న రేవంత్ రెడ్డి... కేసీఆర్ తో పాటు ఆయన మేనల్లుడు హరీశ్ రావును కూడా ఓ ఆటాడుకున్నారని చెప్పక తప్పదు.