Begin typing your search above and press return to search.

అన్నిఓపెన్ గా చెప్పి చేస్తారా రేవంత్?

By:  Tupaki Desk   |   12 July 2016 11:57 AM IST
అన్నిఓపెన్ గా చెప్పి చేస్తారా రేవంత్?
X
మరీ అమాయకంగా మాట్లాడేస్తున్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. మనసులో అనుకున్నవి అనుకున్నట్లు చెప్పేసి పనులు చేస్తారన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న సచివాలయం వసతికి సరిగా లేదని చెబుతూ.. దాన్ని కూల్చేసి.. ఆ స్థానంలో బ్రహ్మాండమైన సరికొత్త సచివాలయాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటం తెలిసిందే. వసతుల కంటే కూడా వాస్తు బాగోలేని కారణంగానే ఈ కూల్చివేత అన్నది తెలంగాణలోని చిన్నపిల్లాడికి కూడా తెలిసిన బహిరంగ రహస్యమే.

అయినప్పటికీ వాస్తు బాగోలేదని కూల్చేస్తే తాము ఒప్పుకునేది లేదంటూ మండిపడుతున్నారు రేవంత్ రెడ్డి. పదహారు మంది ముఖ్యమంత్రులు పాలించినా లేని వాస్తు దోషం కేసీఆర్ కు ఎలా కనిపించిందంటూ ప్రశ్నిస్తున్న ఆయన.. వాస్తు బాగా లేదని కూల్చివేతకు సిద్ధపడుతున్నారని.. ప్రజాధనాన్ని దుర్వినియోగపరిస్తే ఊరుకునేది లేదంటున్నారు.

రేవంత్ రెడ్డి అమాయకత్వం కాకుంటే.. వాస్తు బాగోలేదన్న మాట కేసీఆర్ లాంటి నేత నోటి నుంచి వచ్చే ఛాన్సే లేదు. ఇప్పటివరకూ ఆయన చెబుతున్నది.. వందమందితో మీటింగ్ పెట్టుకోవాలంటే సచివాలయంలో జాగా లేదని.. బాగా పాతదైపోయిందన్న మాటలే చెబుతున్నారు. అలాంటప్పుడు వందమందితోనో.. 200 మందితోనో మీటింగ్ కోసం ఏకంగా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందన్న మాటను అడగాల్సింది పోయి.. వాస్తు పేరు మీద ఎన్ని వ్యాఖ్యలు చేస్తే మాత్రం కేసీఆర్ అండ్ కో స్పందించరు కదా? అయినా.. మనసులో అనుకున్నవన్నీ ఓపెన్ గా చెప్పేసి చేయరన్న విషయాన్ని రేవంత్ మర్చిపోయి మాట్లాడితే ఎలా..?