Begin typing your search above and press return to search.

తెలంగాణ రాజకీయాలనే షేక్ చేసే ‘రేవంత్ రెడ్డి నిర్ణయం’

By:  Tupaki Desk   |   1 July 2021 7:42 AM GMT
తెలంగాణ రాజకీయాలనే షేక్ చేసే ‘రేవంత్ రెడ్డి నిర్ణయం’
X
టార్గెట్ ఫిక్స్.. అందులో మొదటి మెట్టు ఎక్కేశాడు.. ఇక రాజ్యాధికారమే లక్ష్యం.. అందుకే ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాడు టీపీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ ను గద్దెదించి సీఎం సీటును అధిరోహించడమే ధ్యేయంగా పనిని మొదలుపెట్టేశాడు.

టీపీసీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్ రెడ్డి తన టార్గెట్ కేసీఆర్ అని ప్రకటించాడు. కేసీఆర్ ను గద్దెదించడం.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే తన లక్ష్యమని ప్రతిజ్ఞ చేశారు. అయితే కేసీఆర్ ను గద్దెదించడం ప్రస్తుతమున్న సమయంలో అంత ఈజీ కాదన్న సంగతి అతడికి తెలుసు. కానీ తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఆ భరోసాతోనే రేవంత్ రెడ్డి ముందుకెళుతున్నాడు.

రేవంత్ రెడ్డి టార్గెట్ ఫిక్స్ చేశాడు. కేసీఆర్ పై తొలుత ‘నిరుద్యోగం’ను ప్రయోగించబోతున్నాడు. దీంతో టీఆర్ఎస్ సర్కార్ పై పెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి బ్రహ్మస్త్రంగా భావిస్తున్న ‘పాదయాత్ర’ను మొదలుపెట్టబోతున్నట్టు సమాచారం. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన వారంతా రాజ్యాధికారం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి మొదలుపెట్టి చంద్రబాబు, వైఎస్ జగన్ వరకు పాదయాత్ర చేసి సీఎం అయ్యారు.

ప్లాన్ ఏను రేవంత్ రెడ్డి సక్సెస్ చేశాడు. పీసీసీ చీఫ్ గా ఎంపికయ్యాడు. ప్లాన్ బిగా ఇప్పుడు టార్గెట్ సీఎం సీటును పెట్టుకున్నాడు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి సీఎం కావడం.. రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాడు.ఇప్పటికే తన టీంను రేవంత్ రెడ్డి రెడీ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి సైన్యం హల్ చల్ చేస్తోంది. కేటీఆర్ టీంలాగానే రేవంత్ రెడ్డి టీంలు సోషల్ మీడియాలో పనిని మొదలుపెట్టాయి. రేవంత్ రెడ్డి ఇప్పుడు రెడ్డిలనే కాదు.. బీసీలను తన వైపుకు తిప్పుకోవాలనే భిన్నమైన స్ట్రాటజీతో ముందుకెళుతున్నాడట..

రేవంత్ రెడ్డి ఇప్పుడు సీనియర్లను కలిసి వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. హైకమాండ్ ఆదేశాలతో సీనియర్లు అంతా రేవంత్ రెడ్డితో సాగేందుకు రెడీ అవుతోంది. కేవలం గాంధీ భవన్ లో ఉండి విమర్శలు చేస్తే సరిపోదని.. ప్రజామద్దతును కూడగట్టడం.. వారిలో ఒక ముద్ర వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాన్ని ఇస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు.

జులై 7న తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. అదే రోజున తన భవిష్యత్ కార్యాచరణ ప్రారంభించనున్నాడు. ప్రధానంగా ‘పాదయాత్ర’ను ప్రకటిస్తారని చెబుతున్నారు. ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలను కవర్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్లాన్లకు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం మద్దతు తెలపడంతో జోష్ మీదున్నారు. టీ కాంగ్రెస్ సీనియర్లు మాత్రం రేవంత్ రెడ్డికి సహకరించకుండా మౌనంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలను షేక్ చేసేలా రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉండబోతుందని టాక్.