Begin typing your search above and press return to search.

ఇంద్రవెల్లి సాక్షిగా కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్

By:  Tupaki Desk   |   10 Aug 2021 3:47 AM GMT
ఇంద్రవెల్లి సాక్షిగా కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్
X
ఇంద్రవెల్లిలో బహిరంగ సభ పెడతా. లక్ష మందిని తీసుకొస్తాం. లక్షకు ఒక్కరు తగ్గినా తల వంచుతా.. ఈ లక్ష దండుతో కేసీఆర్ మెడకు ఉచ్చు బిగిస్తా.. అంటూ సవాలు విసిరి మరీ సభ పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్.. తాను అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేశారు. మండే ఎండలో.. కారే చెమటల్ని పట్టించుకోకుండా సభకు హాజరైన వైనం కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం ఉప్పొగింది. ఆయన చెప్పినట్లే ‘ఆత్మగౌరవ సభ’ విజయవంతమైంది.

ఈ సభను విజయవంతం చేయటానికి గడిచిన పది రోజులుగా ఎమ్మెల్యే సీతక్కతో సహా రాష్ట్రస్థాయి పీసీసీ కార్యవర్గ సభ్యులు జిల్లాలోనే మకాం వేసి.. జనాల్ని తరలించేందుకు చేసిన ప్లానింగ్ వర్కువుట్ అయ్యింది. సభకు హాజరైన వారికి తాగునీటితో పాటు.. భోజన వసతిని కల్పించారు. ఈ సభకు రేవంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభను తమ అంచనాలకు ఏ మాత్రం తగ్గని రీతిలో నిర్వహించటం.. జనాల్ని భారీగా తరలించటంలో సక్సెస్ కావటం కాంగ్రెస్ నేతల్లో కొత్త ధైర్యాన్ని నింపింది.

ఇదిలా ఉంటే.. దాదాపు 32 నిమిషాలు మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తన ప్రసంగంలో ఆద్యంతం కేసీఆర్ పైన నిప్పులు చెరిగేందుకే ప్రాధాన్యతను ఇచ్చారు. ఎప్పటిలానే ఘాటైన పదజాలంతో.. కేసీఆర్ తోపాటు.. ఆయన కుటుంబ సభ్యుల మీదా విమర్శనాస్త్రాల్ని సంధించారు. కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. పలుమార్లు కేసీఆర్ అండ్ కోను హెచ్చరించారు. రేవంత్ ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..

- ‘నీ ఫామ్‌ హౌస్‌లో జాగా అడిగినామా, చింతమడకలో గవ్వ అడిగినామా. చింతమడకలో రూ.15 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన నీవు.. 10 పైసలు కూడా దళిత, గిరిజనులకు ఇచ్చినావా? 70 ఏళ్లలో దళితులు, గిరిజనులకు కాంగ్రెస్‌ చేసిందేమీ లేదంటున్న కేసీఆర్‌ ఈ ఏడేళ్లలో ఏం చేశారు?

- కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్లతోనే దళితులు.. గిరిజనులు అనేక రంగాల్లో అభ్యున్నతి సాధించారు. రాజకీయంగా ఉన్నత పదవులు పొందారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం అవినీతి అక్రమాలను ఎండగట్టే రోజులు దగ్గర పడ్డాయి. నాలుగు లక్షల కోట్ల రూపాయిల అప్పు చేసి ఒక్కొక్కరి తల మీద లక్ష అప్పు మోపారు.

- నీ బిడ్డను బిర్లాను చేసినావ్‌. నీ అల్లుళ్ని అంబానీలుగా చేసినావ్‌..కొడుకును టాటా చేసినావ్‌..నీవు నరరూప రాక్షసుడిగా తయారై కుంభకర్ణుడిలా మద్యం తాగి ఫామ్‌ హౌస్‌లో పండుకుంటున్నావ్‌. మరో 20 నెలలే పడుకునేదని, ఫామ్‌ హౌస్, ప్రగతి భవన్‌ గోడలు బద్దలు కొట్టి చర్లపల్లి జైలుకు పంపిస్తాం. అక్కడ సేద తీరాల్సిందే.

- నిన్నటి దాకా ఒక లెక్క. ఇవాల్టి నుంచి మరో లెక్క. దెబ్బకుదెబ్బ. ఒక్కటికి వంద. కేసీఆర్ ను పారదోలే సమయం ఆసన్నమైంది. నేను మరో 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా. జన్మత: నేను దళిత .. గిరిజన బిడ్డను కాదు. కానీ.. నల్లమల అడవి బిడ్డను. అక్కడి చెంచుల కష్టం కళ్లారా చూశా. అణగారిన వర్గాల ఇబ్బందులు తెలుసు. సోనియాగాంధీ ఆశీస్సులతో ప్రజలకు ఏదైనా చేసి చనిపోవాలని నిర్ణయించుకున్నా. కార్యకర్తల అండతో మరో 20నెలల్లో రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం రావటం ఖాయం.

- కేసీఆర్‌ కుటుంబం చేస్తున్న అవినీతి, అక్రమాలు, ఇతరుల భూములు గుంజుకోవడం, పార్టీ ఫిరాయింపులు అన్ని డైరీలో రాసుకుంటున్నాం. అసలు మిత్తితో సహా బదులు తీర్చుకుంటాం. ఇది కార్యకర్తల పార్టీ. గ్రామ.. మండల.. నియోజవర్గ స్థాయిలో కార్యకర్తలను కాపాడుకుంటాం. ప్రజల కోసమే నేనున్నా. నన్ను నమ్మండి.. ఆశీర్వదించండి.

- దండోరా సభకు వస్తున్న వేలాది మందిని ఉట్నూర్‌లో అడ్డుకున్నారు. దెబ్బకు దెబ్బ తీస్తాం. కేసీఆర్‌ను బొందపెట్టడం ఖాయం. రాష్ట్రంలో రావణ రాజ్యం పోవాలి. దళిత, గిరిజన బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలి. దండోరా తదుపరి కార్యక్రమం ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో నిర్వహిస్తాం.

- హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు అమలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా దళిత.. గిరజనబంధు ఇస్తారా? చస్తారా? అని తేల్చుకునేలా కాంగ్రెస్ కార్యకర్తలంతా పని చేయాలి.

- కేసీఆర్ అండతో రిటైర్డు ఐటీ ప్రభాకర్ రావు కాంగ్రెస్ శ్రేణులపై కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నా.. చంద్రమండలంలో ఉన్నా శిక్షిస్తాం. రాష్ట్రపతిగా పని చేసిన కేఆర్ నారాయణన్.. లోక్ సభ స్పీకర్ గా మీరా కుమారి.. మంత్రులుగా గీతారెడ్డి.. భట్టి విక్రమార్క.. దామోదర రాజనర్సింహ లాంటి దళిత బిడ్డలకు పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే.