Begin typing your search above and press return to search.

హరీశ్ ను హైదరాబాద్ నుంచి బహిష్కరించారా?

By:  Tupaki Desk   |   28 Jan 2016 12:17 PM IST
హరీశ్ ను హైదరాబాద్ నుంచి బహిష్కరించారా?
X
తనదైన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాస్తంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ అధికారపక్షాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్న తాజా వ్యాఖ్యలు.. తెలంగాణ మంత్రి హరీశ్ రావును ఇబ్బంది పెట్టేవిగా ఉండటం గమనార్హం.

ఇప్పటికే.. కేటీఆర్.. హరీశ్ ల మధ్య అధిపత్య పోరు నడుస్తుందన్న ప్రచారం విస్తృతం అవుతున్న వేళ.. దానికి సంబంధించి రేవంత్ తాజా వ్యాఖ్య ఉంది. మంత్రి హరీశ్ ను మేనమామ కేసీఆర్.. బావమరిది కేటీఆర్ లు కలిసి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచి బహిష్కరించటంతో దిక్కు తోచక నారాయణఖేడ్ లో తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి విజయం సాధిస్తే.. అసెంబ్లీలో మొదటి కుర్చీ ఇచ్చి ఆయన్ను కూర్చోబెడతామని వ్యాఖ్యానించారు. తాజా ఉప ఎన్నికల్లో ఓటర్లు తెలంగాణ అధికారపక్షానికి షాక్ ఇచ్చి కేసీఆర్ నిషా దించాలన్న రేవంత్ రెడ్డి.. టీడీపీ హయాంలో ఈ నియోజకవర్గ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. గ్రేటర్ ఎన్నికల నుంచి హరీశ్ ను మేనమామ.. బావమరిదులు బహిష్కరించారన్న రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.