Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారు నిర్ణయాల్ని ఈటెల కాపీ చేస్తారా?

By:  Tupaki Desk   |   29 March 2016 11:56 AM IST
ఏపీ సర్కారు నిర్ణయాల్ని ఈటెల కాపీ చేస్తారా?
X
రెండుగా విడిపోయి.. ఎవరికి వారు బతుకుతున్నట్లు పైకి కనిపించినా.. తెలంగాణ.. ఏపీ ప్రభుత్వాల మధ్య పోలిక నిత్యం ఉంటుందన్న విషయం తాజాగా నిరూపించే ఘటన ఒకటి చోటు చేసుకుంది. ​​రెండు ప్రభుత్వాల మధ్య పోలికే లేకున్నా.. అమలు చేసే నిర్ణయాల్ని జాగ్రత్తగా గమనించటం.. ఏపీలో ఏం జరుగుతుందన్న విషయంపై తెలంగాణ సర్కారు ఒక కన్నేసి ఉందా? అంటే.. తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల మాట వింటే అవుననే చెప్పక తప్పదు.

తాజాగా అసెంబ్లీ లాబీల్లో చోటు చేసుకున్న ఒక ఉదంతం ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేస్తుంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల జీతాలు భారీగా పెరుగుతున్న సందర్భంలో.. మాజీల పింఛన్లను కూడా అదే తీరులో పెంచాలన్న నిర్ణయంపై పోరాడే నాయకుడి కోసం వారు తీవ్రంగా వెతుకుతున్నారు. ఇందులో భాగంగా టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని కలిసిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు కలిసి.. తమ పింఛన్ పెంచే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మీరు మాత్రమే బలంగా మాట్లాడగలరంటూ మాజీలు రేవంత్ ను అంటున్న సమయంలోనే అటువైపుగా తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ వచ్చారు.

ఆయన దగ్గర మాజీల పింఛన్ల వ్యవహారాన్ని తీసుకొచ్చి.. పెంచొచ్చు కదా? అని రేవంత్ అడగ్గా.. ‘‘పక్క రాష్ట్రం కూడా అంతే ఇస్తోంది కదా’’ అని ఆయన బదులివ్వటం గమానార్హం. దీనికి స్పందించిన రేవంత్.. ఏపీలో రూ.16వేల లోటు బడ్జెట్ ఉంటే.. మనది రూ.16వేల మిగులు బడ్జెట్ కదా? వారికి మనకు పోలికేంటి?’’ అంటూ ప్రశ్నించటం గమనార్హం. ఈ ఉదంతం చూస్తే.. ఏపీ ప్రభుత్వ విధానాల్ని తెలంగాణ సర్కారు ఓ కంట కనిపెడుతుందన్న విషయం అర్థమవుతుంది.