Begin typing your search above and press return to search.

ఇవే మాటలు డల్లాస్ లోనే కాదు తెలంగాణలోనూ చెప్పాలి రేవంత్

By:  Tupaki Desk   |   4 Jun 2022 1:30 PM GMT
ఇవే మాటలు డల్లాస్ లోనే కాదు తెలంగాణలోనూ చెప్పాలి రేవంత్
X
అవును.. ఇప్పుడున్న రాజకీయంలో మాట ఇవ్వటం నీటి మీద రాతలాంటిది. మాట ఇవ్వటం.. దాన్ని నిలబెట్టుకునేందుకు దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటం అంత తేలికైన విషయం కాదు. అలాంటి విషయంలో మిగిలిన వారి సంగతేమో కానీ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆశను.. ఆకాంక్షను అర్థం చేసుకొని.. వారు కోరుకున్నట్లుగా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం మాటలు చెప్పినంత ఈజీ కాదు. దానికెంతో కసరత్తు.. మరెన్నో లెక్కల్ని చూసుకోవాల్సి ఉంది. రాష్ట్రాన్ని విడదీస్తున్నప్పుడు అనుకూలంగా ఉండే వారే కాదు ప్రతికూలంగా ఉండే వారితో అయ్యే రచ్చను.. దానికి సంబంధించిన నష్టం గురించి ఆలోచించక.. వారికి మాట ఇచ్చాను.. ఏది ఏమైనా జరగాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేయటం అంత సామాన్యమైన విషయం కాదు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఇలాంటివెన్నో చేసిన సత్తా సోనియాగాంధీ సొంతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ మొత్తం నామ రూపాల్లేకుండా తుడుచుకుపెట్టుకుపోతుందని హెచ్చరించినా.. అందుకు సిద్ధమేనంటూ తెగించిన ధీశాలి సోనియాను చెప్పాలి. అయితే.. సోనియా చేసిన సాహసానికి ప్రతిగా ఆమెకు.. ఆమె పార్టీకి దక్కిన ప్రతిఫలం శూన్యమేనని చెప్పాలి. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించినంతనే.. రాష్ట్రంలో తమ పార్టీ తిరుగులేనిదిగా మారుతుందని అంచనా వేసినా.. అందుకు భిన్నంగా పరిస్థితులు చోటు చేసుకోవటం తెలిసిందే.

బ్యాడ్ లక్ ఏమంటే.. 2014 ఎన్నికల సమయంలోనే కాదు.. తర్వాత కూడా టీపీసీసీ చీఫ్ గా వ్యవహరించిన నేతలు ఎవరూ కూడా..తెలంగాణ ప్రజలకు పార్టీని దగ్గర చేసింది లేదు. దీంతో.. దశాబ్దాలు తరబడి తపస్సు చేసినా సరే.. సోనియమ్మ అనుగ్రహించారు కాబట్టి తెలంగాణ రియాల్టీలోకి వచ్చింది తప్పించి.. ఇంకెవరు ఆ స్థానంలో ఉన్నా.. ఇదేదీ సాధ్యం కాదనే చెప్పాలి. ఇదే విషయాన్నితెలంగాణ ప్రజలకు మరింత బాగా అర్థమయ్యేలా చెప్పుకోవటంలోనూ.. ప్రజల్లోకి తీసుకెళ్లటంలోనూ ఫెయిల్ అయ్యారు. ఆ లోటును తీరుస్తూ ఇటీవల టీపీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి కొత్త తరహాలో ప్రయత్నిస్తున్నారని చెప్పాలి.

తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన సానుభూతి పరులతో భేటీ అవుతున్నారు. తనను అభిమానించే వారిని కలుస్తూ.. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా డల్లాస్ లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముందు వందలాది కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు. అమెరికాలో నిర్వహిస్తున్న సమావేశాల్లో నిత్య అసంతృప్తవాది కోమటిరెడ్డిని వెంట పెట్టుకొని వెళుతున్న రేవంత్.. ఆయనకు తగిన ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం చూస్తే.. రేవంత్ గాడిలో పడుతున్నట్లుగా కనిపించక మానదు.

ఇదిలా ఉంటే.. సదరు సభల్లో మాట్లాడే సమయంలో తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియాగాంధీ కమిట్ మెంట్ గురించి పెద్ద ఎత్తున చెప్పుకొస్తున్నారు. ఒకవేళ సోనియాగాంధీ లేని పక్షంలో వంద సంవత్సరాలైనా.. లక్ష మంది కేసీఆర్ లు వచ్చినా తెలంగాణ కలగానే మిగిలిపోయేదని స్పష్టం చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనలో రూ.16వేల మిగులు బడ్జెట్ కాస్తా రాష్ట్రం దాదాపు రూ4లక్షల అప్పుల పాలైందని.. రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేదన్నారు. తరతరాలుగా తెలంగాణ కోసం సాగుతున్న పోరాటాన్ని.. ప్రజల ఆకాంక్షలను సోనియమ్మ గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాల్సిన చారిత్రక అవసరం ఉందని.. ఇందులో భాగస్వామ్యం కావాలంటూ తెలంగాణ వాసులను ఆయన కోరారు. అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడదామని. తెలంగాణకు విముక్తి కల్పిస్తామన్న మాటలు ఒక ఎత్తు.. తెలంగాణ ఏర్పాటులో సోనియమ్మ ఎంత కీలకంగా వ్యవహరించారన్న విషయాన్ని అదే పనిగా చెప్పిన రేవంత్ మాటలు.. తెలంగాణలో కూడా మరింత బలంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.