Begin typing your search above and press return to search.

రేవంత్ దెబ్బ‌కు.. ష‌ర్మిల పార్టీ కోలుకునే ప‌రిస్థితి లేదా?

By:  Tupaki Desk   |   28 Jun 2021 10:30 AM GMT
రేవంత్ దెబ్బ‌కు.. ష‌ర్మిల పార్టీ కోలుకునే ప‌రిస్థితి లేదా?
X
రాజ‌కీయాల్లో ఏమైనా జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. నిన్న ఏమీ లేద‌నుకున్న పార్టీ.. రేపు పుంజుకునే ప‌రిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న పార్టీ కూడా దెబ్బ‌కు పేక‌మేడ‌లా కూలిపోయే చాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే.. వైఎస్ త‌న‌య, ఏపీసీఎం జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల ఎదుర్కొంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆమె ఎన్నో ఆశ‌ల‌తో తెలంగాణ‌లో పార్టీ పెట్టి ఏకంగా అధికార‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమె రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాన్ని త‌న‌వైపున‌కు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇప్ప‌టికే తండ్రి వైఎస్ పేరుతో ఆమె రాజ‌కీయ సానుభూతిని పొందే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే.. ఇది నిన్న‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితి. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయం మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్‌గా ఎంపికైన‌.. యువ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్‌.. రేవంత్‌రెడ్డి.. ఎంట్రీతో రాజ‌కీయ ప‌రిస్తితులు.. ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకున్నాయి. రెడ్డి సామాజిక వ‌ర్గంలో కొత్త ఆశ‌లు చిగురించాయి. వాస్త‌వానికి రెడ్డి వ‌ర్గం కాంగ్రెస్‌తోనే ఉన్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ స‌రైన మార్గంలో పార్టీని న‌డిపించ‌డం లేద‌నే వాద‌న ఉండ‌డంతో వారంతా మౌనంగాఉన్నారు. ఈ క్ర‌మంలోనే వీరిని టార్గెట్ చేసుకున్న ష‌ర్మిల‌.. రెడ్డి వ‌ర్గం త‌న‌కే జై కొడుతుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు.

ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్‌లో వ‌చ్చిన అనూహ్య మార్పు.. రేవంత్ దూకుడుతో రెడ్డి వ‌ర్గం గుండుగుత్తుగా కాంగ్రెస్‌కు పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించే ఛాన్స్ క‌నిపిస్తోంది. ఇక‌, ఎలాగూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ‌ర్గం ఎప్ప‌టి నుంచో కాంగ్రెస్‌తోనే ఉంది. ఇటీవ‌ల పార్టీలో నెల‌కొన్న నాయ‌క‌త్వ లోపంతో వీరి ఓటు బ్యాంకు ను కూడా త‌న‌కు అనుకూలంగా ష‌ర్మిల మార్చుకునేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, ఇప్పుడు రేవంత్ ఎంట్రీతో వీరు కూడా కాంగ్రెస్‌కు లాయ‌ల్‌గా మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పైగా కేసీఆర్‌పై.. రేవంత్‌మాదిరిగా.. ష‌ర్మిల దూకుడు ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం లేదు. అదేస‌మ‌యంలో యువ‌త‌లోనూ ఫాలోయింగ్ లేదు. ఈ ప‌రిణామాల‌తో రేవంత్ దెబ్బ‌కు ష‌ర్మిల పార్టీ కొంప‌కూలిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.