Begin typing your search above and press return to search.

టీ.కాంగ్రెస్ బతకాలి అంటే ఆయన రావాలి.. ఒకటే నినాదం

By:  Tupaki Desk   |   24 Jun 2020 12:10 PM GMT
టీ.కాంగ్రెస్ బతకాలి అంటే ఆయన రావాలి.. ఒకటే నినాదం
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చెరగని ముద్రవేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ను అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీగా రికార్డుల్లోకి ఎక్కింది. 9 ఏళ్ల చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి అధమ స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలూది అధికారంలోకి తీసుకొచ్చారు. వరుసగా పదేళ్లపాటు నిలబెట్టారు. ఉమ్మడి ఏపీ విడిపోయే వరకు కూడా కాంగ్రెస్ పాలనే కొనసాగింది. నాడు కునారిల్లిన కాంగ్రెస్ కు జీవం పోసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

ఇప్పుడు తెలంగాణలోనూ టీ.కాంగ్రెస్ పరిస్థితి అలానే ఉంది. కేసీఆర్ ధాటికి 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండబోతోంది. ఇప్పటికే 6 ఏళ్లు గడిచాయి. కాంగ్రెస్ నేతలంతా కారెక్కారు. ఇప్పటికీ పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ నేతలు కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇద్దామని చూస్తున్నా సీనియర్లు మోకాలడ్డుతున్నారనే ప్రచారం ఉంది. కుమ్మలాటల కాంగ్రెస్ ను ఏకం చేసే వారు ఎవరు? ఎప్పుడు కాంగ్రెస్ కుదుట పడుతుంది..? కేసీఆర్ పై పోరాడుతుందని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.కానీ కాంగ్రెస్ సీనియర్లే ఆ పార్టీని దెబ్బతీస్తున్నారంటున్నారు. యువతరానికి అవకాశం ఇవ్వడం లేదని ఆడిపోసుకుంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ లో యూత్ విభాగంలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. టీకాంగ్రెస్ ను బతికించాలంటే రేవంత్ రెడ్డి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఆ నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ను బతికించాడని.. ఇప్పుడు ఆ సత్తా కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ బతికింది అంటే ఆనాడు వైఎస్ ఆర్ వల్ల అని..ఈనాడు కాంగ్రెస్ బతకాలి అంటే రేవంత్ రెడ్డి కావాలి అంటూ నినదిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి అనుకూలంగా క్షేత్రస్థాయిలో, యువతలో , కాంగ్రెస్ కార్యకర్తల్లో మద్దతు లభిస్తోంది. కేసీఆర్ లాంటి గండరగండరుడు లాంటి నేతను ఢీకొట్టాలంటే అంతటి దమ్ము, ధైర్యం వాగ్ధాటి గల రేవంత్ రెడ్డితోనే సాధ్యమంటున్నారు. మరి కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ ను యాక్సెప్ట్ చేస్తారా? అధిష్టానం ఏం చేస్తుందనే దానిపైనే కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంది.