Begin typing your search above and press return to search.

న్యూఇయర్ వేళ సాగరతీరాన ఆంక్షలివే?

By:  Tupaki Desk   |   31 Dec 2021 9:17 AM GMT
న్యూఇయర్ వేళ సాగరతీరాన ఆంక్షలివే?
X
కొత్త సంవత్సరం అంటే అదో జోష్.. ఎక్కడ లేని ఉత్సాహం వెల్లివిరిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో భారత దేశంలోనూ పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ న్యూ ఇయర్ వేడుకలపై నిబంధనలు పెట్టారు. హైదరాబాద్, తెలంగాణతోపాటు ఏపీలోనూ ప్రభుత్వాలు వేడుకలపై ఆంక్షలు పెట్టారు.

ఇక విశాఖపట్నంలో కొత్త సంవత్సరం వేడుకలపై సిటీ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి నుంచే బీచ్ లో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి ఆర్కే, జోడుగుళ్లపాలెం, సాగరనగర్, రుషికొండ, భీమిలి, యారాడ బీచ్ లకు సందర్శకులు, వాహనాల రాకపోకల నియంత్రణ విధించనున్నట్లు అందులో పేర్కొన్నారు.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నేవల్ కోస్ట్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ బీచ్ రోడ్ లో అన్ని రకాల వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఎన్ఏడీ ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. అదే విధంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ బీఆర్టీఎస్ రోడ్ నుంచి పెందుర్తి జంక్షన్ వరకూ రహదారులు మూసివేయనున్నారు.

ఇక ఆంక్షల్లో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ మద్దిలపాలెం జంక్షన్ నుంచి రామా టాకీస్ వరకూ ఉన్న బీఆర్టీఎస్ రోడ్ మధ్య లైను, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న అండర్ పాస్ ను కూడా మూసివేయనున్నారు. కాగా తాగి వాహనాలు నడిపే వారిపై, స్పీడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు. రెస్టారెంట్లు, బార్లు, హోటల్స్, షాప్ లు ప్రభుత్వ నిబంధనల మేరకే తెరవాలని సూచించారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.