Begin typing your search above and press return to search.

నువ్వేం మంత్రివయ్యా.. కారు, బంగ్లా నచ్చలేదని రాజీనామా

By:  Tupaki Desk   |   2 July 2021 11:55 AM IST
నువ్వేం మంత్రివయ్యా.. కారు, బంగ్లా నచ్చలేదని రాజీనామా
X
‘సుఖం వస్తే ముఖం కడగడానికి తీరదట’.. వెనుకటి ఎవరో చెప్పిన ఈ సామెతను అక్షరాల ఈ బీహార్ మంత్రికి అప్లై చేయవచ్చని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సుబ్బరంగా మంత్రి పదవి ఇచ్చి.. కారు, బంగ్లా ఇస్తే కాలు మీద కాలేసుకొని పరిపాలన చేసుకోవయ్యా అంటే.. ‘కేవలం కారు, బంగ్లా నచ్చలేదనే’ కారణంగా రాజీనామా చేసేశాడు ఓ మంత్రివర్యులు. ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

ఒకప్పుడు బీహార్ అంటేనే ఒకప్పుడు గుండాలు, రౌడీలకు మారుపేరుగా ఉండేది.కానీ కొద్దిసంవత్సరాలుగా అది పూర్తిగా మారింది. కానీ అక్కడి నేతలు, అధికారుల్లో మాత్రం ఇంకా ఆ ఆదిపత్య జాడ్యం పోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

బీహార్ సీఎం నితీష్ కేబినేట్ లోని మంత్రి చేసిన పనికి ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకున్నారు. బీహార్ మంత్రి మదన్ సాహ్ని తాజాగా తన మంత్రి పదవికి రాజీనామా చేసేశారు. జేడీయూలో సీనియర్ నేత అయిన సాహ్నికి సామాజిక సేవకుడిగా.. మంచి నేతగా పేరుంది. ఎంతో కష్టపడి పంచాయతీ వార్డు మెంబర్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కేబినెట్ మంత్రి అయ్యారు. వివాదరహితుడు అనే పేరు కూడా ఉంది.

పోయిన సారి బీహార్ ఎన్నికల్లో దర్బాంగ జిల్లా బహదూర్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నితీష్ కుమార్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. అయితే బీహార్ లోని బలమైన బ్యూరోక్రసీ అధికారుల దెబ్బకు ఈ మంత్రి చాలా ఇబ్బందులు పడ్డాడట.. ఐఏఎస్ లు , అధికారులు అస్సలు సహకరించలేదట.. దీనిపై సీఎం నితీష్ కు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదట..

ప్రభుత్వ అధికారులకు తనకు మంచి కారు, మంచి బంగళా కేటాయించకపోవడం వల్ల ఏకంగా మదన్ సాహ్ని తన మంత్రి పదవికి రాజీనామా చేసేశారట.. కారణాలు ఇవేనంటూ సీఎం నితీష్ కు రాజీనామా లేఖను పంపాడు. దాన్ని మీడియాకు విడుదల చేయడంతో అదిప్పుడు వైరల్ గా మారింది.

జేడీయూ మంత్రి మదన్ సాహ్ని రాజీనామా వెనుక కేవలం మంచి కారు, బంగళా అనేది కారణం కాదనే వాదన వినిపిస్తోంది. ఈయన బీజేపీకి మద్దతుగా.. నితీష్ కుమార్ ను బలహీన పరచాలనే ఉద్దేశంతోనే ఇలా చేశాడని.. దీనికి వెనుక బీజేపీ హస్తం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే పోయిన సారి బీహార్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. బీజేపీకి రెండో స్తానంలో నిలిచింది. అయినా కూడా తక్కువ సీట్లు వచ్చిన జేడీయూతో జతకట్టిన బీజేపీ నితీష్ కే సీఎం పీటం అప్పగించింది. అయితే అప్పటి నుంచే నితీష్ ను బలహీన పర్చాలనే ఉద్దేశంతోనే జేడీయూ ఎమ్మెల్యేలను లాగేస్తోందని.. మదన్ సాహ్నీ కూడా బీజేపీ స్కెచ్ లో భాగంగానే మంత్రి పదవినుంచి వైదొలిగాడనే టాక్ నడుస్తోంది.

అయితే మంత్రి రాజీనామా నిర్ణయాన్ని సీఎం నితీష్ ఆమోదించలేదు. ఇటు జేడీయూ, అటు బీజేపీ సైతం దీనిపై స్పందించాల్సి ఉంది. ఈ పరిణామం బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.