Begin typing your search above and press return to search.

తెలంగాణ పాలిటిక్స్: మరో హీరోయిన్ ఎంట్రీ..

By:  Tupaki Desk   |   22 Aug 2018 12:57 PM GMT
తెలంగాణ పాలిటిక్స్: మరో హీరోయిన్ ఎంట్రీ..
X
రాజకీయాలు, సినీ గ్లామర్ కు చాలా దగ్గరి సంబంధం ఉంది. సినీ తారలే రాజకీయ నాయకులై రాష్ట్రాలను ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలిన సంఘటనలు మన ముందున్నాయి. ఓ ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి వారు సినీ తారలుగా వెలుగు వెలిగి.. అనంతరం రాజకీయాల్లో ఉద్దండపిండాలుగా తమ ప్రతిభ చాటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినీ స్టార్స్ పొలిటికల్ స్టార్స్ గా మారడం చాలా కామన్.. ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద మరో హీరోయిన్ రాజకీయ సమరానికి సై అంటోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్.? ఎక్కడి నుంచి పోటీచేస్తుందనే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ రాజకీయాల్లో సినీ గ్లామర్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే విజయశాంతి తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద హల్ చల్ చేస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ ఆపరేషన్ 2019 అనడానికి రెడీ అవుతోందట.. ఇప్పటికే కాషాయ కండువా వేసుకున్న హీరోయిన్ రేష్మా రాథోడ్.. తన రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్దం చేసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.

టాలీవుడ్ లో ‘ఈరోజుల్లో’ చిత్రంతో రేష్మారాథోడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఉదయ్ కిరణ్ తో ‘జైశ్రీరామ్’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఓ పది వరకు టాలీవుడ్ - కోలీవుడ్ - మాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

తెలంగాణలో 2019 ఎన్నికల్లో దూసుకుపోవాలని అన్ని కోణాల్లోనూ బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో సినీ గ్లామర్ కు కూడా ఆపార్టీ ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే పార్టీలోకి వచ్చిన రేష్మా రాథోడ్ కు కాషాయ కండువా వేసి ఆమెకు సీటు కూడా కన్ఫం చేసినట్టు సమాచారం.

వరంగల్ జిల్లా ఇల్లందు మండలంలో జన్మించిన రేష్మా..ఇప్పుడు అక్కడే రాజకీయంగా ఎదిగేందుకు ప్లాన్ చేశారు. 2019 ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీగా పోటీచేసేందుకు ఆసక్తి చూపుతోందట .. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ డ్.. స్వతహాగా రేష్మా కూడా ఎస్టీ కావడంతో ఆమెకు ఈ నియోజకవర్గం కలిసి వచ్చింది. దీంతో రేష్మా రాథోడ్ ఇప్పుడు తన ఫోకస్ అంతా ఆ పార్లమెంట్ స్థానంపైనే పెట్టారు. అక్కడ వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారు.దీంతో మహబాబూబాద్ ఎంపీ సీటు రేష్మాకే అన్న గుసగుసలు కాషాయ పార్టీ నుంచి వెలువడుతున్నాయి. గిరిజన సమస్యల నుంచి.. బయ్యారం ఉక్కు పరిశ్రమ దాకా మహబూబాబాద్ సమస్యలపై పోరాడేందుకు రేష్మ కార్యాచరణ రూపొందించుకున్నట్టు తెలిసింది.

రేష్మ విద్యావంతురాలు. ఇప్పటివరకూ రాజకీయాల్లో లేకపోవడంతో ఆమెపై అవినీతి ఆరోపణలు లేవు. దీంతో నీట్ ఇమేజ్ తో రాజకీయాల్లోకి వస్తుండడం ఆమెకు కలిసి వస్తుందంటున్నారు. పైగా స్థానికురాలు కావడం ఆమెకు ప్లస్ పాయింట్. వీటన్నింటికి మించి సినీ గ్లామర్ ఉంది. ఇవన్నీ కలిసి మహబూబాబాద్ పై కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని బీజేపీ నేతలు నమ్ముతున్నారట.. అధికారికంగా ఆమెకు సీటు కన్ఫం కాకపోయినా మహబూబాబాద్ లో ఆమె పనిచేస్తున్న తీరును చూస్తే ఆమె ఎంపీ అభ్యర్థి అని కిందిస్థాయి నేతలు - కేడర్ ఫిక్స్ అయిపోతున్నారట.. 2019 ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో సినీ గ్లామర్ తో రేష్మా ఎంతవరకు ప్రయత్నిస్తుందనేది వేచిచూడాల్సిందే.