Begin typing your search above and press return to search.

సచివాలయ పోస్టుల్లో రిజర్వేషన్ రచ్చ..అసలేం జరిగింది?

By:  Tupaki Desk   |   18 Oct 2019 4:24 AM GMT
సచివాలయ పోస్టుల్లో రిజర్వేషన్ రచ్చ..అసలేం జరిగింది?
X
నవ్యాంధ్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు... సరికొత్తగా చేపట్టిన సచివాలయ వ్యవస్థపై ఇటు మెయిన్ మీడియాతో పాటు అటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే కదా. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ పూర్తిగా అమలులోకి రావాలంటే కాస్తంత సమయం అవసరమే. అదే సమయంలో ఆదిలో కొంత మేర ఇబ్బందులు తలెత్తే విషయం కూడా కాదనలేనిదే. కొత్తగా ప్రవేశపెట్టే ఏ వ్యవస్థలోనైనా ఓ మోస్తరు లోటుపాట్లు కూడా ఉండటం సహజమే. వాటన్నింటినీ సరిచేసుకుని వ్యవస్థను చక్కదిద్దేందుకు కొంత సమయం కూడా పడుతుందన్నదీ కాదనలేదనిదే. ఇలాంటి విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో సచివాలయ వ్యవస్థపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ కొత్త రచ్చ మొదలైపోయింది. రిజర్వేషన్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు సున్నా మార్కులు వచ్చినా కొలువులు దక్కాయని - కటాఫ్ మార్కులు మించి ఉత్తమ ఫలితాలు సాధించిన జనరల్ అభ్యర్థులకు పోస్టులు దక్కడం లేదన్నది ఈ రచ్చ వాదన.

ప్రభుత్వ ఉద్యోగుల భర్తీలో రిజర్వేషన్లు పాటించాలని మన రాజ్యాంగమే చెప్పింది కదా. అంతేకాకుండా రిజర్వ్ డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు కేటాయించిన పోస్టులను ఇతర వర్గాలతో భర్తీ చేయరాదన్న నియమాన్నీ రాజ్యాంగమే నిర్దేశించింది కదా. మరి ఇప్పుడు సచివాలయ పోస్టుల భర్తీలో కూడా ఈ నిబంధనలు అమలు చేయాల్సిందే కదా. రిజర్వేషన్లను అమలు చేయకుండా పోస్టులు భర్తీ చేస్తే తప్పు కానీ... రిజర్వేషన్లను అమలు చేస్తూ పోస్టులు భర్తీ చేస్తే తప్పెలా అవుతుంది? నిజమే కదా. సచివాలయ పోస్టుల్లో రిజర్వేషన్ల ప్రాతిపదికననే పోస్టులను భర్తీ చేయాలి. జగన్ సర్కారు చేసింది కూడా అదే. అయితే సచివాలయాలలో కొత్తగా భర్తీ అవుతున్న పలు పోస్టులకు ఒకే అర్హతలు ఉన్న నేపథ్యంలో ఒకే అభ్యర్థి నాలుగైదు పోస్టులకు సంబందించిన పరీక్షలకు హాజరయ్యాడు. ఈ క్రమంలో ఆ అభ్యర్థి చివరకు ఏ పోస్టును నిర్దేశించుకని... వేటిని వదులుకుంటారో ఇంకొంత సమయం గడిస్తే తప్పించి తెలియదు. ఈ క్రమంలో అసలు భర్తీ అయిన పోస్టులు ఎన్ని? ఖాళీగా మిగిలిన పోస్టులు ఎన్ని? అన్నది తేలేందుకు కూడా కొంత సమయం పడుతుంది. ఈ వాదనపై ఎవరికీ అభ్యంతరం లేకున్నా... రిజర్వ్ డ్ కేటగిరీ పోస్టుల భర్తీ వద్దకు వచ్చేసరికి ఈ కొత్త చర్చ... రచ్చరచ్చగా మారిపోయింది.

రిజర్వ్ డ్ కేటగిరీలకు కేటాయించిన నియామకాల్లో ఇప్పుడైనా - తర్వాతైనా... ఆ కేటగిరీకి చెందిన అభ్యర్థులతోనే పోస్టులు భర్తీ చేయక తప్పదు. ఇప్పుడు ఆ పోస్టులకు తగినంత మంది రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులు లేకపోతే... ఆ పోస్టులు ఖాళీగానే ఉండిపోతాయి తప్పించి... ఇతర కేటగిరీ అభ్యర్థులతో భర్తీ కావు. అలా భర్తీ చేయడానికి రాజ్యాంగం అనుమతించదు కూడా. ఈ నేపథ్యంలోనే రిజర్వ్ డ్ కేటగిరీల్లో భారీగా మిగిలిపోయిన పోస్టుల సంఖ్యను ప్రభుత్వానికి తెలియజేసిన కొన్ని జిల్లాల కలెక్టర్లు వాటిని భర్తీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో సున్నా మార్కులు వచ్చిన రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు సున్నా మార్కులు వచ్చినా గానీ పోస్టులు దక్కాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జనరల్ కేటగిరీకి చెందిన కొందరు అభ్యర్థులు... సున్నా మార్కులు వచ్చిన అభ్యర్థులకు పోస్టులు ఎలా ఇస్తారంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. ఈ రచ్చకు అసలు ప్రాతిపదికే లేదన్నది కొందరి వాదన. ఎందుకంటే... ఈ రిజర్వేషన్ల ప్రాతిపదికన ఇంజినీరింగ్ - మెడికల్ సీట్ల కేటాయింపుల్లో సున్నా మార్కులు - మైనస్ మార్కులు వచ్చినా సీట్లు దక్కాయి కదా. ఇప్పుడూ అలాగే... సున్నా మార్కులు వచ్చిన రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు కూడా సచివాలయ పోస్టులు దక్కాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ కొత్త రచ్చకు ఆస్కారమే లేదన్నది విశ్లేషకుల మాటగా వినిపిస్తోంది.